కేంద్రంలో అప్పుడు అధికారంలో ఉన్నదీ బీజేపీనే, ఇప్పుడు అధికారంలో ఉన్నదీ బీజేపీనే. అప్పుడూ మోడీనే ప్రధాని. ఇప్పుడూ ఆయనే ప్రధాని. తేడా ఏమిటంటే.. అప్పుడు చంద్రబాబు, ఇప్పుడు చంద్రశేఖర రావు మాత్రమే.
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి కేసీఆర్ వెళ్లనున్నారనే వార్తను చదివితే, ఇలాంటి ఫీట్లనే కదా.. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు చేసినది అనే విషయం తట్టవచ్చు. అయితే చంద్రబాబు అప్పుడు కాంగ్రెస్ తో కలిసి ఉత్తరభారతదేశంలో ప్రచారానికి వెళ్లారు. కేసీఆర్ మాత్రం బీజేపీ యేతర, కాంగ్రెసేతర.. అంటున్నారు!
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి కోసం కేసీఆర్ ప్రచారం చేస్తారట. ఈ ప్రచారంలో మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్లు కూడా పాల్గొంటారట. ఈ బ్యాచ్ తో కలిసే అప్పట్లో చంద్రబాబు ప్రచారం చేశారు. ఆ తర్వాతి సంగతి తెలిసిందే.
మరి చంద్రబాబు అనుభవాల నుంచి కేసీఆర్ పాఠం నేర్చి ఉండరా? అప్పుడు వేరు, ఇప్పుడు వేరు, తను వేరు, చంద్రబాబు వేరే.. అనే దృఢమైన విశ్వాసంతో కేసీఆర్ ఉన్నారా? లేక అంతర్గత లెక్కలు ఇంకా ఏమైనా ఉన్నాయా? అనేవి బయట పడే అంశాలు కాదు.
అయితే కేసీఆర్ గతంలో కూడా ఈ మూడో ఫ్రంట్ ప్రయత్నాలు చేసి భంగపడిన వ్యక్తే అని కూడా వేరే చెప్పనక్కర్లేదు. మూడో ఫ్రంట్ ప్రయత్నాలకు అప్పట్లోనే భంగపాటు ఎదురైనా.. కేసీఆర్ మాత్రం తగ్గేదేలా అన్నట్టుగా ఇప్పుడు ఆ నేతలతోనే మళ్లీ కలుస్తున్నారు. మరి ఈ సారి ఈ ముచ్చటెలా ఉంటుందో!