దేశంలో కరోనా కేసుల తీవ్రత చాలా వరకూ తగ్గిపోయింది. ప్రస్తుతం రోజువారీ కేసుల సంఖ్య ఏడు వేల లోపుకు చేరాయి. అలాగే యాక్టివ్ కేసుల సంఖ్య లక్ష లోపుకు తగ్గిపోయింది. దీంతో మూడో వేవ్ పూర్తిగా ముగిసినట్టే అని పరిశోధకులు చెబుతూ వస్తున్నారు. మూడో వేవ్ ప్రారంభ దశలో రోజువారీ కేసుల సంఖ్య పది వేల స్థాయిలో నమోదయ్యేవి. ఆ స్థాయి నుంచి రోజువారీగా కేసుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం ఆరేడు వేల స్థాయిలో రోజువారీ కేసులు వస్తున్నాయి.
రోజువారీగా ఈ సంఖ్య క్రమం తప్పకుండా తగ్గిపోతూ ఉన్న నేపథ్యంలో.. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా చాలా వరకూ తగ్గిపోయింది. ప్రస్తుతం ఈ సంఖ్య లక్షల నుంచి వేల స్థాయికి తగ్గింది.
మరి మూడో వేవ్ అయితే ఇలా ముగుస్తోంది కానీ, ఇకపై కరోనా ప్రభావం ఎలా ఉంటుందనేది తదుపరి చర్చ. ఇది వరకే పరిశోధకులు స్పందిస్తూ.. కరోనా మూడో వేవ్ మాత్రమే కాదు, నాలుగు , ఐదో వేవ్ లు కూడా ఉంటాయంటూ వ్యాఖ్యానించారు. మానవాళి మధ్యన వైరస్ ల ప్రభావం అలానే ఉంటుందని వారు చెప్పారు. అయితే క్రమంగా మనుషులకు ఇమ్యూనిటీ పెంపొందుతుందని, చివరకు ఇలాంటి అంటు వ్యాధులు సాధారణ స్థాయి ప్రభావం చూపే దశకు వస్తాయని వైరాలజిస్టులు చెబుతూ వచ్చారు.
ఇలా చూస్తే.. మూడో వేవ్ ముగిసినా, నాలుగో వేవ్ ఉండటం ఖాయమే! అయితే ఆ ప్రభావం ఎలా ఉంటుందనేది మాత్రం ప్రస్తుతం పూర్తి స్పష్టత లేని అంశం. మూడో వేవ్ లో వ్యాపించిన ఒమిక్రాన్ ఒక రకంగా కరోనా నివారణ వ్యాక్సినేషన్ లా పని చేసిందని కూడా వైద్య పరిశోధకులు చెబుతున్నారు. ఒమిక్రాన్ వేరియెంట్ సోకిన వారిలో తీవ్ర పరిణామాలు తక్కువేనని, ఈ లైట్ వేరియెంట్ తో కొంత మంచి జరిగిందనే వాదనలూ ఉన్నాయి.
ఇక కరోనా ఎండెమిక్ స్థాయికి చేరిందని, పాండెమిక్ గా దీని ప్రభావం తగ్గిపోయిందని అనేక మంది వైద్య ప్రముఖులు వ్యాఖ్యానించారు. ఆ సంగతలా ఉంటే.. ఈ ఏడాది జూన్ సమయంలో కరోనా నాలుగో వేవ్ లో రావొచ్చనే అంచనాలు వేస్తున్నారు కొంతమంది పరిశోధకులు. మార్చి ఆరంభం నాటికి మూడో వేవ్ ప్రభావం పూర్తిగా తగ్గిపోగా.. మరో రెండు మూడు నెలల్లోనే మరో వేవ్ రావొచ్చంటున్నారు.
బహుశా కరోనా తన మరో రూపాన్ని మార్చుకుంటుంది కాబోలు ఆ సమయానికి! అలా రూపం మార్చుకునే కరోనా ప్రభావం ఎలా ఉంటుందనేది మాత్రం ప్రస్తుతానికి మిస్టరీనే. కరోనా సాధారణ జలుబులా మారి కొనసాగుతుందా, లేక మరోసారి పంజా విసురుతుందా అనేదానికి రానున్న రోజులు సమాధానం ఇవ్వనున్నాయి.