చాలా సంవత్సరాల తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి అల్లుడి పేరు వార్తల్లోకి వచ్చింది. నర్రెడ్డి రాజశేఖర రెడ్డి.. గతంలో వినిపించి, ఆ తర్వాత తెరమరుగైన పేరు ఇది. దాదాపు దశాబ్దం కిందట… చేతికి బ్యాండేజ్ వేసుకుని టీవీ చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటూ వైఎస్ జగన్ పై విమర్శలు సంధించిన నర్రెడ్డి రాజశేఖర రెడ్డి ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి.. సొంత పార్టీని పెట్టుకున్న సమయంలో వైఎస్ వివేకానందరెడ్డి వ్యవహరించిన తీరు అందరికీ గుర్తున్నదే. జగన్, ఆయన తల్లి విజయమ్మ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బయటకు రాగా, వైఎస్ వివేకానందరెడ్డి మాత్రం కాంగ్రెస్ ను వీడి రాననే ప్రకటన చేశారు.
అలా వైఎస్ ఫ్యామిలీలో తొలి చీలిక బాహాటం అయ్యింది. అప్పటికే కొంతమంది కడప జిల్లా కాంగ్రెస్ నేతలు, జేసీ దివాకర్ రెడ్డి లాంటి వాళ్లు.. దివంగత వైఎస్ పై బాహాటంగా విమర్శలకు దిగారు. అంత వరకూ వైఎస్ భజన చేసిన ఆ కాంగ్రెస్ నేతలు ఆయన చనిపోగానే.. రూటు మార్చిన వైనం పై చర్చ సాగుతుండగా, వైఎస్ వివేక కాంగ్రెస్ హై కమాండ్ పై విశ్వాసం ప్రకటించడం సంచలనం అయ్యింది.
జగన్ ను వ్యతిరేకించగానే.. వివేకకు కాంగ్రెస్ నుంచి ఆదరణ లభించింది. వెనువెంటనే ఆయన మంత్రి అయ్యారు. కనీసం ఎమ్మెల్యే కూడా కాని వివేకను అర్ధాంతరంగా మంత్రిని చేశారు. ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో పులివెందుల నుంచి వైఎస్ విజయమ్మపై పోటీ చేశారు వివేక. ఆ సమయంలోనే.. వివేక కూతురు, అల్లుడు వంటి వారు తెర మీదకు వచ్చారు.
వివేకానందరెడ్డి తరఫున నర్రెడ్డి రాజశేఖరరెడ్డి గట్టిగా పని చేశారు. టీవీ చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటూ కాంగ్రెస్ విధేయుడిగా తన మామ తరఫున మాట్లాడారు. నాటి ఎన్నికల ప్రచారంలో కూడా నర్రెడ్డి రాజశేఖరరెడ్డి గట్టిగా తిరిగారు. టీవీ చానళ్లలో కూర్చుని జగన్ ను తిట్టారు.
అప్పటికే కడప లో లోకల్ గా వినిపించిన టాక్, వివేకానందరెడ్డి రాజకీయం వెనుక ఆయన అల్లుడి ఆలోచనలూ, వ్యూహాలే కీలకం అనేది! చివరకు పులివెందుల ఉప ఎన్నికలో వివేకానందరెడ్డి చిత్తవ్వడంతో.. నర్రెడ్డి రాజశేఖరరెడ్డి అడ్రస్ ఆ తర్వాత మిస్ అయ్యింది.
కొన్నేళ్లకు వివేక మళ్లీ జగన్ కు చేరువ అయినా నర్రెడ్డి రాజశేఖర రెడ్డి మళ్లీ తెరపైకి రాలేదు. పదేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ ఆయన పేరు మీడియాకు ఎక్కుతోంది. అప్పుడూ జగన్ పై విమర్శలతోనూ, ఇప్పుడు సంచలన ఆరోపణలనతోనూ ఈయన వార్తల్లో నిలవడం గమనార్హం.