ఎమ్బీయస్ కథ 01: విగ్రహచారం

నేను విగ్రహాత్మని. జీవాత్మలెన్ని వున్నా పరమాత్మ ఒక్కడే అన్నట్లు రాష్ట్రంలో నా విగ్రహాలు ఎన్ని వున్నా అన్నిటికీ కలిపి ఒకటే విగ్రహాత్మ. అది నేనే. జీవులకు గ్రహచారం వున్నట్లే, విగ్రహాలకు విగ్రహచారం వుంటుంది. నా…

నేను విగ్రహాత్మని. జీవాత్మలెన్ని వున్నా పరమాత్మ ఒక్కడే అన్నట్లు రాష్ట్రంలో నా విగ్రహాలు ఎన్ని వున్నా అన్నిటికీ కలిపి ఒకటే విగ్రహాత్మ. అది నేనే. జీవులకు గ్రహచారం వున్నట్లే, విగ్రహాలకు విగ్రహచారం వుంటుంది. నా విగ్రహచారం బాగుండడం వలన యీ వూళ్లోనే కాదు, రాష్ట్రంలో ఏ వూళ్లోనైనా సరే ఎక్కడ చూసినా, ఎటువైపు చూసినా నా విగ్రహాలే కనబడతాయి. మూడేళ్లు మాత్రమే ముఖ్యమంత్రిగా చేసిన ఒక దివంగత నాయకుడికి యిన్ని విగ్రహాలుండడం సాధారణంగా జరగదు. కానీ మా అబ్బాయి నా పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి వద్దామనుకోవడంతో నాకీ భాగ్యం పట్టింది.

నిజానికి నేనున్నంత కాలం మా వాడు వ్యాపారాల్లోనే మునిగివున్నాడు. నేను పోయాక వాడి చుట్టూ స్నేహితులు చేరి ‘మీ నాన్నకు ప్రజల్లో చాలా పలుకుబడి వుంది కదా, హైకమాండ్‍ వాళ్లు ఆ ముఖ్యమంత్రి పోస్టేదో నీకే యివ్వచ్చు కదా’ అని ఎగేశారు. పార్టీ హై కమాండ్‍ మాత్రం మరోలా తలచింది. ‘మీ నాన్న చేసినదంతా పార్టీ ద్వారానే చేశాడు. ఏదైనా పేరూ ప్రఖ్యాతీ, వారసత్వం వస్తే అది పార్టీకే రావాలి, నీక్కాదు’ అనేసింది.

మా వాడికి తిక్క రేగింది. మొదటి స్టెప్‍గా నన్ను ఆకాశానికి ఎత్తేసి, ఆ తర్వాత నా ఆశయాలు నెరవేరాలన్నా, అసంపూర్ణంగా మిగిల్చిపోయిన పనులు పూర్తి చేయాలన్నా తనను నా స్థానంలో కూర్చోబెట్టాలని ప్రజలందరూ గట్టిగా అనుకుని, పైకి అనేలా చేస్తే హైకమాండ్‍ దిగి వస్తుందని లెక్క వేశాడు. అందువలన రాష్ట్రమంతా పర్యటిస్తూ కనబడిన చోటల్లా నా విగ్రహాలు స్థాపించడం మొదలుపెట్టాడు. ప్రజల మనసుల్లోంచి నా బొమ్మ చెరిగిపోకుండా చూడాలని వాడి తాపత్రయం.

అయితే వాడి ప్లాన్లకు ఒక అవరోధం వచ్చి పడింది. నాలుగు రోడ్లు కలిసిన చోటల్లా నా విగ్రహం వుండి తీరాలని మా వాడు అనుకున్నట్లే పార్టీ మాజీ అధ్యక్షుడు సుబ్బయ్య కొడుకూ అనుకున్నాడు. నిజానికి సుబ్బయ్య నాకు వ్యక్తిగతంగా మంచి స్నేహితుడు. ఇద్దరం కలిసే పార్టీని అధికారంలోకి తెచ్చాం. నేను రాష్ట్రంలోనే వుండి అతన్ని కేంద్రంలో మంత్రిగా పంపాలని అనుకున్నాను. కానీ పార్టీ నిధుల పంపిణీ విషయంలో అతనికి ఓ ఫ్యాక్షనిస్టుతో గొడవలు వచ్చాయి. వాళ్లు  దారి కాసి చంపేశారు.

సుబ్బయ్య కొడుకు అఖండుడు. చంపినవాళ్లు మావోయిస్టులని ప్రకటించేశాడు. తన తండ్రి రాష్టప్రజల కోసం ప్రాణాన్ని ఒడ్డాడన్నాడు. ఆ త్యాగం విఫలం కాకుండా వుండాలంటే తనను కనీసం మంత్రిని చేయాలన్న ప్రచారం మొదలుపెట్టాడు. ఓ పత్రిక పెట్టాడు, మూణ్నెళ్లు పోయాక టీవీ ఛానెల్‍ చేర్చాడు. తన తండ్రి పేదల కోసం ఎన్నో ప్రణాళికలు రచించి పెట్టుకున్నాడని, వాటిని పాఠకులతో పంచుకుంటున్నాననీ చెప్పి పత్రిక ద్వారా, టీవీలో చర్చల ద్వారా అతని పేరు నిరంతరం జనాల నోళ్లల్లో నానేట్టు చేశాడు. అది చాలనట్లు మావాడు వదిలేసిన సెంటర్లలో వాళ్ల నాన్న విగ్రహాలు పెట్టేయడం మొదలు పెట్టాడు.

సాధారణంగా విగ్రహాలమీద పక్షుల రెట్టలు వుంటూంటాయి. మా యిద్దరి విగ్రహాల్లో చాలా వాటికి ఆ బెడద వుండేది కాదు. సెల్‍టవర్ల ధర్మమాని పక్షుల సంతతి ఓ పక్క తగ్గిపోతోంది, మా పిల్లల పుణ్యమాని మా విగ్రహాలు దినదినం పెరిగిపోతున్నాయి. మా వాడి ఢిల్లీ లాబీయింగ్‍ పనిచేసిందో లేకపోతే  జనాలు నన్నింకా మర్చిపోలేదని హైకమాండ్‍ అనుకుందో తెలియదు కానీ మా వాడికి మంత్రి పదవి యిస్తానంది. ‘మా నాన్న పుట్టినరోజు వస్తోంది, అవేళ ప్రమాణస్వీకారం చేస్తాను’ అన్నాడు మావాడు. నా మీద యింత పితృభక్తా అని ఆశ్చర్యపడ్డాను కానీ తర్వాత అసలు విషయం తెలిసింది.

‘రోడ్డు మీద, పొలాల్లో, వంతెన కింద, గుట్ట మీద – ఎటు చూసినా మీ నాన్నగారిదో సుబ్బయ్యగారిదో విగ్రహం కంటపడిపడి జనాలకు మొహం మొత్తింది. వాటికేసి తలతిప్పి చూడడం మానేశారు. విగ్రహాల మీద మనం పెట్టిన పెట్టుబడంతా వేస్టవుతోంది. మన విగ్రహాల్లో ఏదైనా స్పెషాలిటీ వుంటేనే జనాలు పట్టించుకుని తేరిపార చూస్తారు. అప్పుడే మీ నాన్నగారి పలుకుబడి, దాని వలన మీ బలం పెరుగుతుంది.’ అని కార్యకర్తలు చెప్పారట.

‘’మా నాన్న అయిదుంపావు అడుగులే వున్నా ఆజానుబాహువన్నట్లుగా రెట్టింపు సైజులో కంచు విగ్రహాలు చేయిస్తున్నాంగా’’ అన్నాడు మావాడు.

‘’సుబ్బయ్యగారబ్బాయీ అలాగే చేయిస్తున్నాడుగా, రంగులు కూడా కొట్టవచ్చినట్టు వేయిస్తాడు. వాటిని రకరకాల యాంగిల్స్లో ఫోటోలు తీసి తన పేపర్లో వేస్తాడు. బోల్డు కెమెరా ట్రిక్స్తో టీవీలో చూపిస్తాడు. వాటి ముందు, ఒకలా చెప్పాలంటే మన విగ్రహాలు బోసిపోతాయన్నా’’

మా వాడు కాస్త హైటెక్‍ మనిషి. బాంబే నుంచి ఓ కన్సల్టెంట్‍ను తెచ్చాడు. అతను ఒక ఉపాయం చెప్పాడు. విగ్రహం భుజాల దగ్గర, మోచేతుల దగ్గర, మణికట్ల దగ్గర విడగొట్టి మధ్యలో కప్పీలు దూర్చి, వాటి మీద నుంచి తాళ్లు పోనిచ్చి రీ-వెల్డింగు చేయాలి. విగ్రహం కింద వుండే దిమ్మ డొల్లగా చేసి చిన్న అర కట్టి దానిలో ఆరు హ్యేండిల్సు పెట్టాలి. వాటిని అటూయిటూ తిప్పడం ద్వారా విగ్రహం చేతులు కదల్చవచ్చు. ఆ అర కనబడకుండా దిమ్మ మీది డిజైనులో కలిపేయాలి. ఈ యింజనీరింగు పని చేస్తుందాని మా వాడికి అనుమానం వచ్చింది. ఇంట్లో ఓ విగ్రహం మీద ప్రయోగం చేసి చూపిస్తే నచ్చి రాష్ట్రంలో వున్న వాటన్నిటికీ ఏర్పాటు చేయమని చెప్పారు. దానికి పదిరోజులు పడుతుందన్నాడతను. అందుకే వీడు టైమడిగాడు.

రేపు మావాడి ప్రమాణస్వీకారం అనగా రాత్రికి రాత్రి నా విగ్రహాలన్నిటిలో కప్పీలు లాగి సిద్ధం చేశారు. జనాలు పొద్దున్న లేచి చూసేసరికి నా విగ్రహాలన్నీ చెయ్యెత్తి ఆశీర్వదిస్తున్నాయి. ‘పెద్దాయన తన వారసుణ్ని పై లోకాల నుంచి ఆశీర్వదిస్తున్నట్లుంది’ అని ప్రచారం చేశారు మా వాడి కార్యకర్తలు. ఉన్నట్టుండి విగ్రహాల పోజులు మారిపోవడం ప్రజలను విస్మయానికి గురి చేసింది. ఎప్పుడూ యిలాగే వుండేదా, లేక మనం పొరబడ్డామా అని పందాలు వేసుకున్నారు. రోడ్డు మీద వెళ్లేవాళ్లు వెనక్కివెనక్కి తలతిప్పి చూశారు. వినాయకుడు పాలు తాగాడన్నది ఎంత గొప్ప వార్తయిందో విగ్రహం భంగిమ మారిపోయిందన్నది కూడా అంత వింత వార్తయింది. తీరుబాటుగా వున్న జనాలు విగ్రహం కింద నిలబడి దానికేసే దీర్ఘంగా చూస్తూ వుండేవారు – ఉన్నట్టుండి మరో పోజులోకి చటుక్కున మారిపోతుందేమో, ఆ దృశ్యం ఎక్కడ మిస్సయిపోతామో అని. ఓ నెల్లాళ్ల పాటు సుబ్బయ్య విగ్రహాలను పట్టించుకున్నవాడే లేడు. అతని విగ్రహచారం అలా ఏడ్చింది మరి. సుబ్బయ్య కొడుకు వాళ్ల పేపర్లో మా వాణ్ని తిట్టిపోశాడు. మంత్రి పదవికి రాజీనామా చేసి వీధిలో మోళీలు చేసుకుని బతకమని సంపాదకీయాలు రాయించాడు.

మంత్రి అయిన నెల్లాళ్లకు మావాడు ఒక వర్గం వారిని బిసిలుగా గుర్తించే విషయమై కమిషన్‍ వేస్తానని హామీ యిచ్చాడు. మరుసటి రోజే నా విగ్రహాలన్నీ చప్పట్లు కొడుతున్న పోజులు కనబడ్డాయి. మూడో నెలలో మరో నిర్ణయానికి అభయహస్తం చూపించాయి. ఆ పై నెల శభాష్‍ అన్నట్టు చూపుడువేలు, బొటన వేలు కలిపి సున్నా చేశాయి. ఈ విన్యాసాలు జనాల్ని ముగ్ధుల్ని చేశాయి. నా విగ్రహాల కేసి జనాలు కన్నార్పకుండా చూడసాగారు. ‘మీ నాన్నగారి విగ్రహం మా కాలనీలో పెట్టండంటే మా కాలనీలో పెట్టండి’ అంటూ డిమాండ్లు రాసాగాయి.

ఇదంతా మావాడికి బాగానే వుంది కానీ సుబ్బయ్య కొడుక్కి పిచ్చెత్తించేసింది. మా వాడి నుంచి ఫిరాయించిన ఒకణ్ని పట్టుకుని ఆ బాంబే కన్సల్టెంటు అడ్రసు సంపాదించి తనకూ పనిచేసి పెట్టమన్నాడు. ‘నాకు ఎవరైనా ఒకటే, ఫీజు యిచ్చినవారిని సంతృప్తి పరచడమే నా పని’ అన్నాడతను. ‘రెట్టింపు ఖర్చయినా ఫర్వాలేదు, మా నాన్న విగ్రహాలు చేతులే కాక, కాళ్లు కూడా కదిపేట్లు చూడు’ అన్నాడు సుబ్బయ్య కొడుకు.

ఇక అప్పణ్నుంచి మా వాడి వల్ల ఏదైనా పొరపాటు జరగ్గానే సుబ్బయ్య విగ్రహం నుదురు కొట్టుకోవడమో, ముక్కు మీద వేలు వేసుకోవడమో, కాలితో గాల్లో తన్నడమో, రెండు చేతులతో కళ్లో, చెవులో మూసుకోవడమో ఏదో ఒకటి చేసి నిరసన తెలిపేది. జనాలంతా నా విగ్రహం కంటె ఆ విగ్రహం కేసే ఎక్కువగా చూడసాగారు. అంటే నా విగ్రహాత్మ గ్రహాలు వక్రించాయన్నమాట.

సుబ్బయ్య కొడుక్కి ఆత్మవిశ్వాసం పెరిగింది. మా వాడు మంత్రిగా పనికి రాడనేది జనవాక్యమని, అతని పనులను నిరసించిన విగ్రహాలను ఆరాధించడం ద్వారా జనాలు తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారని హైకమాండ్‍ దగ్గర వాదించాడు. తనకు మంత్రి పదవి యివ్వాలని, కుదరకపోతే కనీసం మా అబ్బాయికి తీసేయాలని పట్టుబట్ట సాగాడు. మొదటి దాని కంటె రెండోది సులభమనుకున్న హైకమాండ్‍ మా వాడి పదవి పీకేసింది. దాంతో మావాడు పార్టీలోంచి కొందరు ఎమ్మెల్యేలను తీసుకుని బయటకు వచ్చేశాడు. ప్రభుత్వం పడిపోయింది. ఎన్నికలు ప్రకటించారు. మా పార్టీ తరఫున సుబ్బయ్య కొడుకు ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటించారు. నా పేర వెలసిన మావాడి పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో విడిగా చెప్పనక్కరలేదు.

అధికారంలో ఉన్న మా పార్టీ రెండు ముక్కలైంది, ఏడాదికి ముందే ఎలక్షన్లు వచ్చాయి. నాలుగేళ్లగా ప్రతిపక్షంలో వున్న మగ్గుతున్న పార్టీకి నెత్తిమీద పాలు పోసినట్లయింది. ఉధృతంగా ప్రచారం చేయడం మొదలెట్టారు. అన్నిటికన్న ముందు వాళ్ల కన్ను మా విగ్రహాల మీద పడింది. మామూలు రోజుల్లోనే యిన్ని ట్రిక్కులు వేసినవాళ్లు ఎన్నికల సమయంలో మరెన్ని వింతలు చూపిస్తారో అని భయపడ్డారు. వాళ్ల పార్టీ వ్యవస్థాపకుడికీ విగ్రహాలున్నాయి. కానీ ఆయన్ని కొన్నాళ్లు ఆకాశానికి ఎత్తేసి, మరి కొన్నాళ్లు పాతాళానికి దించేసి, సరిగ్గా వాడుకోలేదు. మా విగ్రహాల సందడి చూశాక, వాటితో కూడా ఏమైనా చేద్దామని చూశారు కానీ అవన్నీ సిమెంటు విగ్రహాలు కాబట్టి కీళ్లు కదలిస్తే కుప్పకూలిపోతాయని బాంబే కన్సల్టెంటు చెప్పడంతో ఐడియా విరమించుకున్నారు.

వాళ్లకు ఛాన్సు లేదు కాబట్టి మా వాళ్లకూ లేకుండా చేద్దామనుకుని ఎన్నికల కమిషన్‍కు ఫిర్యాదు చేశారు. మా విగ్రహాలు చూసి ఓటర్లు భ్రమించి మా వారసులకు ఓట్లేసేస్తారట. అందుకని రాష్ట్రంలోని అన్ని విగ్రహాల మీద ఎన్నికలయ్యేదాకా గుడ్డేసి కప్పేయాలట. కమిషనర్‍ సరేననడంతో మా విగ్రహాలన్నిటికీ ముసుగులు పడ్డాయి. చందగ్రహానికే తప్పని గ్రహణం మా విగ్రహాలకు తప్పుతుందా?

అవేళ రాత్రి పన్నెండైంది. ఆజాద్‍ చౌక్‍లో నా విగ్రహం దగ్గర కారు ఆగింది. ఒకడు బయటకు దిగి విగ్రహం చాటుగా వచ్చి ఫోన్‍ చేశాడు ‘’అన్నా, ఎదర చెకింగ్‍ అవుతోంది. పట్టుబడితే పేర్లు బయటకు వస్తాయి. వెనక్కి తిరిగి వెళ్లినా రిస్కే. ఏం చేయమంటావ్‍?’’

అవతలివాడు అడిగాడు ‘’కారులో క్యాష్‍ ఎంతుంది.’’

‘’పది’’

‘’భూమి అమ్మిన తాలూకు డబ్బని చెప్పు.’’

‘’సేల్‍ డీడ్‍ కాపీ అడుగుతున్నారు. లేకపోతే ఓటర్లకు పంచడానికి పట్టుకెళుతున్నామని రాసి యిమ్మంటున్నారు. పెద్దన్న పేరు బయటకు వస్తుందన్నా. కాస్త అడిగి చెప్పు.’’

‘’సరే, అక్కడే వుండు. అడిగి చెప్తా.’’

కారులోంచి డ్రైవరూ, యింకో అతనూ దిగారు. ఒళ్లు విరుచుకుని రెండు సిగరెట్లు తాగేసరికి అటునుంచి ఫోన్‍ వచ్చింది. ‘’పెద్దన్న నడిగా. చెక్‍ చేశాడు. పట్టుకుంటున్న మాట కరక్టే. రిస్కు తీసుకోవద్దన్నాడు. మీరున్న చోట నుంచి వంద గజాల దూరంలో చెరువుంది కదా. దాన్లో పడేయమన్నాడు. బ్యాగ్‍తో సహా పడేయవద్దు, చప్పుడవుతుంది. మూత్రానికి పోయినట్టుగా పోయి, తలా నాలుగూ పడేసి రండి. నాలుగైదు రౌండ్లు కొట్టండి.’’

ఇతను ఆశ్చర్యపడ్డాడు. ‘’పది లక్షలన్నా.. నీటిపాలు చేయడమా? ఎవడు తిన్నట్టు?’’

‘’పోతే పోయింది. ఎమ్మెల్యే అయితే వెయ్యిరెట్లు సంపాదించవచ్చు. పట్టుబడితే యాగీ అవుతుంది. చెప్పినది చేయండి, చాలు, వాదనలొద్దు. ఈ కాల్‍ ట్రాక్‍ చేస్తే మళ్లీ అదో తంటా.’’

ముగ్గురూ ఆలోచనలో పడ్డారు. పెద్దన్నకు డబ్బు అక్కరలేదు, పోనీ మనమే తీసుకుంటే.. అనుకున్నారు. కానీ ఎలా?

డ్రైవరు ముసుగేసిన నా విగ్రహం కేసి చూస్తూ మరో సిగరెట్టు వెలిగించాడు. హఠాత్తుగా ఆలోచన వెలిగింది. ‘’ఈ విగ్రహం ముసుగులో దాచి పెట్టి వెళదాం. తెల్లవారు ఝామున సైకిలు మీద వచ్చి తీసుకుందాం. ఆ పాటికి చెకింగ్‍ పార్టీ వెళ్లిపోవచ్చు.’’ అన్నాడు. తక్కిన యిద్దరికీ ఐడియా నచ్చింది. ముసుగులో దూరి విగ్రహం కాళ్ల దగ్గర  పెట్టబోతూ వుంటే బ్యాగ్‍ కింద పడింది. వంగి తీస్తూ వుంటే దిమ్మలో కనబడకుండా ఏర్పాటు చేసిన అర తాలూకు తలుపు పిడికి తగులుకుంది. అదేమిటో తెలియలేదు. సెల్‍ఫోన్‍ లైటులో గమనించి తలుపు తెరిచారు. లోపల హేండిల్స్ కనబడ్డాయి. ‘’ఇదా వీళ్ల ట్రిక్కు’’ అన్నాడొకడు.

‘’ఏమైతేనేంలే. మనకో సేఫ్‍ డిపాజిట్‍ లాకరు కట్టిపెట్టారు’’ అన్నాడు మరొకడు.

బ్యాగ్‍లోంచి డబ్బు కట్టలు తీసి దాన్లో పేర్చేశారు. బ్యాగ్‍ పట్టుకెళ్లి చెఱువులో పారేసి వస్తూంటే డ్రైవరు ‘’ఉత్తరప్రదేశ్‍లో మాయావతి ఏనుగు బొమ్మలు పెట్టిస్తే అది వాళ్ల పార్టీ ఎన్నికల గుర్తని యిలాగే ముసుగులు వేయించారట. ఏనుగు పొట్టంటే ఏకంగా కోట్లకికోట్లు పడతాయి.’’ అన్నాడు.

‘’డబ్బెందుకు, ఎగస్పార్టీ వాణ్ని మర్డరు చేసేసి శవాన్ని దాచేయవచ్చు.’’

‘’ఎగస్పార్టీ వాళ్లెందుకులే, మన పార్టీ ఎమ్మెల్యేల కోసం పెట్టే క్యాంపులు బెంగుళూరులో బదులు ఏనుగు కడుపులో పెట్టేయచ్చు.’’

ముగ్గురూ పగలబడి నవ్వుకున్నారు. ఇంకో మూడు గంటల్లో సైకిళ్లేసుకుని వద్దామనుకుని వెళ్లిపోయారు.

అయితే రెండు గంటలకు ఓ తాగుబోతు బ్యాచ్‍ వచ్చింది. ఎవడో కాండిడేటు చిత్తుగా పోయించి తలా బాటిలు చేతికిచ్చి పంపించేడు. ఇంటికి వెళుతూ  ఎవరో సినిమా హీరోయిన్‍ అందచందాల గురించి వాదించుకోసాగారు. అంతలో పోలీసు విజిల్స్ వినబడ్డాయి. ‘’ఎవడ్రా తాగుబోతు నాయాళ్లు’’ అని ఎవరో అరిచారు. బాటిల్సుతో పట్టుబడితే న్యూసెన్సు కేసు పెట్టి లాకప్పులో పడేస్తారని భయపడి ముగ్గురు నా విగ్రహం మొదల్లో కూర్చున్నారు. ఇంకోడు సీసాలతో సహా ముసుగులో దూరాడు.

పోలీసులు వచ్చారు. ‘’ఏరా యిక్కడ కూర్చున్నారు?’’

‘’చెరువు గాలి పీల్చుకుందామనండి’’

‘’కొంపల్లేవా?’’

‘’ఉన్నాయండి, ఫ్రెండ్స్ కదండీ, సరదాగా కబుర్లు చెప్పుకుందామనండి…’’

‘’దూరం నుంచి నలుగురు కనబడ్డారు. ఇంకోడేడీ? ముసుగులో దూరాడా? ఒరేయ్‍, బయటకు రా’’ అని లాఠీతో ముసుగు మీద కొట్టాడు.

నాలుగోవాడు తల బయటకు పెట్టి ‘’నాకు చల్లగాలి పడదండి’’ అన్నాడు.

‘’..పడకపోతే యింటికెళ్లి తొంగో. అక్కడేం చేస్తున్నావురా?’’ అని రెక్క పట్టుకుని బయటకు యీడ్చాడు.

వాడి చేతిలో బాటిల్సు లేవు. పోలీసులకు ఏం చేయాలో తోచలేదు. ‘’బేవార్సు నాయాళ్లు తగిలారు’’ అని తిట్టేసి వెళ్లిపోయారు.

‘’బాటిల్సేవిరా?’’ అని అడిగారు ముగ్గురూ. ‘’అక్కడో అర కనబడితే దాన్లో పెట్టా’’ అన్నాడు వాడు.

బాటిల్స్ తీయబోతే వాళ్ల చేతికి నోట్ల కట్టలు తగిలాయి. కంగారు పడ్డారు. నిషా దిగడానికి ఒకరి నొకరు గిల్లుకున్నారు. చివరకు దొంగ నోట్లయి వుంటాయనుకున్నారు.

కాదెహే, మంచివే అంటాడు ఒకడు.

దొంగనోట్లు కాకపోతే యిక్కడెందుకు పడేసి పోతారు? దొంగ నోటు కేసులో యిరుక్కున్నామంటే పదేళ్లు శిక్ష పడుతుంది అన్నారు తక్కిన ముగ్గురూ.

అయితే మీరు తీసుకోకండి. అన్నీ నేనే పట్టుకుపోతాను అన్నాడు మొదటివాడు.

అమ్మో, అలా ఎలా ఒప్పుకుంటాం అన్నారు తక్కినవాళ్లు.

ఇలా అయితే ఎప్పటికి తేలేను? మీరు తీసుకోరు, నన్ను తీసుకోరు అని పేచీకి దిగాడు మొదటివాడు.

పావుగంట దాకా వాదోపవాదాలు నడిచాయి. చివరకు మోటారు సైకిలు మీద వస్తున్న ఒకతన్ని ఆపారు. అతను ఒక జర్నలిస్టు. ఆఫీసు పని ముగించుకుని యింటికి వెళుతున్నాడు. ఇతను ఫలానా అని తెలిశాక, యిలాటివాళ్లకు ఏది అసలో, ఏది నకలో తెలుస్తుంది కాబట్టి నోట్లు చూపిద్దామనుకున్నారు.

అతను సెల్‍ఫోన్‍ వెలుతురులో నోటును తిరగేసి, బోర్లేసి, గీత వుందేమో చూసి, వాసన చూసి మంచివే అన్నాడు. మీకెలా వచ్చిందో చెప్పమన్నాడు. చెప్పాక నాకూ వాటా వేయకపోతే పోలీసులను పిలిచి పట్టిస్తానన్నాడు. ఎలాగూ ఉద్దరిగా వస్తున్నదే కదాని వాళ్లు సరేనన్నారు. తలా రెండు లక్షలు తీసుకుని లేచిన రోజు బాగుందనుకుంటూ యిళ్లకు బయలుదేరారు.

ఇంటికి వెళ్లాక జర్నలిస్టుకి నిద్ర పట్టలేదు. అక్కడకు అంత డబ్బెలా వచ్చింది వుంటుందాన్న ఆలోచనలో పడ్డాడు. పోలింగు ముందు రోజున పంచిపెట్టడానికి ముందునుంచే దఫదఫాలుగా కొద్దికొద్దిగా డబ్బు తెచ్చి అక్కడ లాకరులో దాచి వుంటారని వూహించాడు. పోలింగు దగ్గర పడుతున్న కొద్దీ నిఘా మరింత ఎక్కువై డబ్బుల సరఫరా కష్టమవుతుంది కాబట్టి యీ ఏర్పాటు చేసి వుంటారు. ముసుగేసిన విగ్రహాల జోలికి ఎవరూ రారు కదా, పార్టీ కార్యకర్తలు చుట్టూ మూగి, ఒక్కో ఓటర్ని విగ్రహం ముసుగులోకి నెట్టి డబ్బిచ్చి పంపేస్తారు కాబోలు అనుకున్నాడు. అనుకున్నాక దీని మీద ఒక కథనం రాయకుండా వుండలేకపోయాడు. తను మనసులో అనుకున్నదంతా వేలాది ప్రజలు గుసగులాడుకుంటున్నట్లు కల్పించి రాసేశాడు. అప్పటి కప్పుడు ఆఫీసు కెళ్లి స్టోరీ యిచ్చేసి వచ్చాడు. వీలైతే ఫ్రంట్‍ పేజీలో వచ్చేట్లు చూడమని సబ్‍ఎడిటరుకి చెప్పేసి వచ్చాడు.

సబ్‍ఎడిటరు కథనం చదివాడు కానీ ఫ్రంట్‍ పేజీలో కాదు కదా, ఏ పేజీలోనూ వేయలేదు. ‘విగ్రహాల్లో డబ్బులు దాచారట, మీకు దగ్గర్లో వున్న విగ్రహాలు చెక్‍ చేసుకుని చేతి కందినంత తీసుకోండి’ అని తన బంధువులకు, స్నేహితులకు, మిగతా వూళ్లల్లో వున్న స్నేహితులకు వాట్సప్‍లో మెసేజి పెట్టేసి అప్పటికప్పుడు యింటికి బయలుదేరాడు. దారిలో కనబడిన ప్రతీ విగ్రహం ముసుగులోకి దూరి చూశాడు.

ఈ మధ్య ‘వైరల్‍’ అనే మాట బాగా వాడుతున్నారు. అదేమిటో వైరస్‍లా అనుకునేవాణ్ని. ఈ విగ్రహాల్లో డబ్బు వార్త ఒకరి వాట్సప్‍లోంచి యింకోరి వాట్సప్‍కు వైరస్‍ కంటె వేగంగా వ్యాపించింది. రాష్ట్రంలో అన్ని జిల్లాలలకు ఒక్క గంటలో పాకేసింది. పిల్లలు, పెద్దలు, ఆడవారు, మగవారు, పేదవారు, డబ్బున్నవాళ్లు పల్లెవాసులు, పట్టణవాసులు – దాని పాలబడనివారు లేరు. ఓసి, బిసి, ఓబిసి, బిబిసి.. ఏ వర్గాన్నీ అది వదలలేదు. జనం ఎవరికీ తెలియకుండా వచ్చామనుకుంటూనే తండోపతండాలుగా తరలి వచ్చారు, విగ్రహాలపై పడ్డారు.

జనం కదలిరావాలి, ప్రజాప్రభంజనం సృష్టించాలి, సేనలా ముందుకు ఉరకాలి అని ఉపన్యాసాలు యిచ్చాం కానీ అది నిజంగా జరిగితే ఎలా వుంటుందో ఎన్నడూ చూడలేదు. ఇప్పుడు చూశాను. విగ్రహాల దిమ్మలతో మొదలుపెట్టి ఆపాదమస్తకం ఏ కీలుకా కీలు విరిచి నోట్ల కోసం చూశారు. కనబడకపోయేసరికి కసితో కంచు విగ్రహశకలాలను సుత్తులతో కొట్టి ముక్కలుముక్కలు చేశారు.

సూర్యోదయం అయ్యేసరికి నా విగ్రహాత్మ ఒక్కటే మిగిలింది. నా అంశ వున్న విగ్రహం ఒక్కటీ మిగల్లేదు. సుబ్బయ్య సంగతీ డిటోడిటో. జనాలు మా విరోధిపక్షం నాయకుడి సిమెంటు విగ్రహాలనూ వదల్లేదు. ఒక్క పూటలో రాష్ట్రం మొత్తం విగ్రహరహిత ప్రాంతంగా అయిపోయింది.

మా విగ్రహచారం కాకపోతే ఏమిటిదంతా? పోనీ మా వాడు ముఖ్యమంత్రి అయితే మా విగ్రహాలు మళ్లీ పెడతాడేమోనని ఆశ పడ్డాను. కానీ  మా పార్టీ రెండుగా చీలడంతో మా విరోధిపక్షం వాళ్లు నెగ్గి అధికారంలోకి వచ్చారు. ‘మా తక్షణ కర్తవ్యం రోడ్ల విస్తరణ, ఇకపై ఏ విగ్రహాన్నీ పెట్టనివ్వం’ అని ప్రకటించారు. దాంతో పాదచారులు, వాహనకారులు అందరూ హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. డబ్బు దొరుకుతుందన్న ఆశపడి, ఉసూరుమన్న మామూలు ప్రజలు కూడా అన్ని విగ్రహాల మీద కసి పెంచుకుని, ఎవరైనా చాటుమాటుగా విగ్రహం పెడితే తక్షణమే కూల్చేస్తాం అని ప్రకటించారు.

మా గ్రహాలకు ఎప్పుడు స్థానచలనం కలుగుతుందో, మా విగ్రహాలు మళ్లీ ఎప్పుడు వెలుస్తాయో తెలియకుండా వుంది.

– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2022)

[email protected]