రాజకీయ వర్గాల్లో కొత్తవిషయం వినిపిస్తోంది. వివేకానందరెడ్డి అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి.. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడుతో చేతులు కలిపారా? చంద్రబాబు స్కెచ్ ప్రకారమే ఆయన ఇప్పుడు నడుచుకుంటున్నారా? చంద్రబాబు కోటరీ తయారు చేసిన స్క్రిప్టు ప్రకారమే సీబీఐకి వాంగ్మూలాలు ఇస్తున్నారా? అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి.
మొన్నమొన్నటిదాకా అవినాష్ పాత్ర గురించి మాత్రమే మాట్లాడుతూ వచ్చిన వివేకా కూతురు సునీత, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు ఆరోపణలన్నీ డైరక్టుగా జగన్ మీదనే చేస్తున్నారు. ఈ భారీసాయానికి ప్రతిఫలంగా నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డికి తక్షణ ప్రయోజనం కొంత, తెలుగుదేశం అధికారంలోకి వస్తే అప్పుడు మరింతగా దక్కేలా ఒప్పందం కుదిరినట్టుగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ విషయాల్లో వాస్తవం ఎంత ఉన్నదో తెలియదు గానీ.. జరుగుతున్న పరిణామాలు మాత్రం.. ప్రజల్లో పుడుతున్న అనుమానాలు నిజమే అనిపించే విధంగా ఉన్నాయి.
నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి.. విజయమ్మ మీద వివేకానందరెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ప్రధాన కారకుడని, ఆయనకు ఇష్టంలేకపోయినా.. పోటీ చేయించాడని అప్పట్లో స్థానికంగా బాగా వినిపించింది. ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డిమీద తీవ్రమైన ఆరోపణలు గుప్పిస్తూ.. ఆకాశరామన్న కరపత్రాలు ప్రచురించి.. ఆయనను బద్నాం చేయడానికి నర్రెడ్డి ప్రయత్నించారని కూడా ఆరోపణలు వినిపించాయి.
అయితే.. వివేకానందరెడ్డిని తన ప్రయోజనాలకు వాడుకోదలచుకుంటున్న తీరు చూసి వివేకా దూరం పెట్టారని, ఆయన మరణం తర్వాత.. తిరిగి అదే స్కెచ్ వేస్తే జగన్ పొసగనివ్వలేదని స్థానికులు అంటుంటారు. ఈ నేపథ్యంలోనే తను ఆశించే ప్రయోజనాలను చంద్రబాబు ద్వారా నెరవేర్చుకోవడానికి నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి.. కొత్త ఎత్తులు వేస్తుండవచ్చుననే అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి.
ఈ అనుమానాలు బలపడడానికి మరో కారణం ఏంటంటే.. ఇప్పుడీ హత్య ఎపిసోడ్.. వైఎస్ కుటుంబ వ్యవహారంలా కనిపించడం లేదు. తెలుగుదేశానికి- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మధ్య రాజకీయ వ్యవహారంలాగా కనిపిస్తోంది. రాజశేఖర్ రెడ్డి చిన్న విమర్శ చేస్తే చాలు.. దానికి మద్దతుగా చంద్రబాబునాయుడు ఎగబడి ముందుకు వచ్చేస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి మీద సజ్జల రామకృష్ణా రెడ్డి చిన్న విమర్శ చేస్తే చాలు.. మొత్తం తెలుగుదేశం పార్టీ గణాలన్నీ కూడా ఎడాపెడా చెలరేగిపోతున్నాయి.
తెలుగుదేశం పార్టీ యావత్తూ.. ఇప్పుడీ రాజశేఖర్ రెడ్డి వెన్నంటి నిలిచి.. వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేయడానికే పనిచేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ప్రధాన ప్రతిపక్షంగా వారికి రాజశేఖర రెడ్డి ఆరోపణలు నిజమని చాటడం మినహా మరో ప్రజాసమస్య ఏదీ కనిపించడం లేదా అనే అనుమానం కూడా కలుగుతోంది.
తెలుగుదేశం పార్టీ ఇంతగా భుజాన వేసుకోవడం గమనిస్తే ఎవ్వరికైనా సరే.. నర్రెడ్డికి , చంద్రబాబుతో ఏదో డీల్ కుదిరినట్టే ఉన్నదని.. అందుకే ఇంతగా పార్టీ మొత్తం మోస్తున్నారని అర్థమవుతుంది.
నర్రెడ్డి చెప్పిన మాటల్లో మరో విషయం గమనించాల్సి ఉంది. వివేకా హత్య ద్వారా ఏర్పడిన సానుభూతిని జగన్ తాను ముఖ్యమంత్రి కావడానికి వాడుకున్నారని ఆయన అన్నారు. పులివెందుల వైఎస్ఆర్ భార్య మీద పోటీచేసి ఓడిపోయిన నాయకుడు వివేకా! ఆయన హత్యకు గురైతే ఖచ్చితంగా ప్రజల్లో సానుభూతి పుడుతుంది. కానీ.. మహా అయితే అది పులివెందుల నియోజకవర్గం, పరిసర ప్రాంతాలకు పరిమితం అవుతుంది. వివేకా హత్య వలన పుట్టే సానుభూతి అనేది రాష్ట్రమంతా జగన్ కు ఓట్లు వేయించింది అన్నట్టుగా నర్రెడ్డి చెబుతున్న మాటలు పెద్ద కామెడీ.
ఆ ఒక్క మాట చూస్తేనే ఆయన పనిగట్టుకుని విషప్రచారానికి పూనుకుంటున్నట్టుగా అర్థమైపోతుంది. అదే సమయంలో.. ఇప్పుడు ఆయన చేస్తున్న విమర్శలు, ఏకంగా జగన్ మీదికే నెడుతున్న ఆరోపణలు మాత్రం.. రాష్ట్రవ్యాప్తంగా ఆయన ప్రతిష్టను దిగజార్చేలా.. యావత్ తెలుగుదేశం శ్రేణులు పూనుకుని ప్రచారం చేస్తుండడం గమనిస్తే.. డీల్ కుదిరిందనే ఎవ్వరికైనా అనిపిస్తుందది.