మరో రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఏపీలో మరోసారి అధికారం ఎవరికి దక్కనుందనే చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ పాలనపై సహజంగానే అంచనాలు, అభిప్రాయాల సేకరణ ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు జగన్ పాలనా విధానాలను చూస్తే మరోసారి అధికారం దక్కే చాన్స్ ఉందా? …అనే ప్రశ్నకు భిన్నాభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఈ మూడేళ్లలో దాదాపు రూ.1.30 లక్షల కోట్లు వివిధ సంక్షేమ పథకాలకు ఖర్చు చేసినా… ఏపీ ప్రభుత్వంపై జనం పెదవి విరుస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ప్రధానంగా మరోసారి వైసీపీనే అధికారంలోకి వస్తుందని వాదించే లేదా నమ్మేవాళ్ల లెక్కలేంటో తెలుసుకుందాం. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఇప్పటికీ పుంజుకోలేదు. క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి బలమైన కేడర్ ఉన్నప్పటికీ, నడిపించే నాయకత్వం కొరవడింది. అలాగే టీడీపీ ఒంటరిగా పోటీ చేసి, ఎప్పుడూ అధికారంలోకి రాలేదనే సెంటిమెంట్‌ను తెరపైకి తెస్తున్నారు. జనసేన-బీజేపీ కూటమి, టీడీపీ వేర్వేరుగా పోటీ చేయడం వల్ల అధికార పార్టీపై వ్యతిరేక ఓట్లు చీలి, అంతిమంగా తిరిగి వైసీపీనే అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందని చెబుతున్నారు.
ఈ వాదనపై టీడీపీ నేతలు తమదైన శైలిలో సమాధానం ఇస్తున్నారు. ఏప్రిల్ లేదా మే మాసం నుంచి టీడీపీ క్షేత్రస్థాయిలో విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించేందుకు సమాయత్తం అవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాధ్యమైనన్ని ఎక్కువ తప్పులు చేసేలా తమ పార్టీ ప్రేక్షకపాత్ర పోషిస్తూ వచ్చింది. రానున్న రోజుల్లో ప్రజావ్యతిరేక విధానాలపై ధర్నాలు, రాస్తారోకోలు, బహిరంగ సభలు నిర్వహించి భారీగా జనాన్ని కూడగొట్టేందుకు ప్రణాళిక రచించింది.
ఇక ప్రజావ్యతిరేక ఓటు చీలే విషయమై… 2019 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచే పార్టీకే ఓటు వేయాలన్న ఓటర్ ఆలోచనను గుర్తు చేస్తోంది. దీంతో 2024 ఎన్నికల్లో జనసేన-బీజేపీ కూటమి కంటే టీడీపీకే జనం పట్టం కట్టేందుకు తప్పక మొగ్గు చూపుతారని ఆ పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు. రానున్న రోజుల్లో వైసీపీకి ఓటు వేయాలంటే గజగజ వణికిపోయేలా జగన్ పరిపాలన ఉందని, అదే అన్నిటికంటే తమకు కలిసొచ్చే అంశమని టీడీపీ నేతలు సమాధానం ఇస్తున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ అన్ని వర్గాలతో ఘర్షణ పడడం తమకు అనుకోని వరమని టీడీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. కావున క్షేత్రస్థాయిలో ప్రతిపక్ష టీడీపీ బలంగా లేదనే వాదనలో నిజం లేదని వారు అంటున్నారు. జగన్ అధికారంలోకి రారనే తెలిస్తే, వైసీపీలో ఎవరూ మిగలరని టీడీపీ నేతలు చెప్పడం విశేషం.