ఒకవైపు బాలీవుడ్ లో సినిమాలు వరసగా బాల్చీలు తన్నేస్తున్నాయి. ప్రత్యేకించి సౌత్ రీమేక్ సినిమాలు వరసగా తెరకెక్కుతున్న హిందీలో.. వాటి ఫ్లేవర్ చెడిపోయి తేడా వస్తోంది! ఈ మధ్యకాలంలో అదీ ఇదీ అని తేడా లేకుండా హిందీ సినిమాలు వరస వైఫల్యాల బాటలో ఉన్నాయి. స్ట్రైట్, రీమేక్, ప్రయోగం, బయోపిక్.. అంటూ తేడా లేకుండా హిందీ చిత్రపరిశ్రమ విజయం కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తోంది.
బాలీవుడ్ కు మళ్లీ మంచి రోజులు వస్తాయంటూ అక్కడి తారలు ఒకరికొకరు స్ఫూర్తిని నింపుకునే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అచ్చంగా అలాంటి పరిస్థితుల్లో ఉంది హిందీ చిత్ర పరిశ్రమ. ఇలాంటి క్రమంలో రాబోయే సినిమాలపై అక్కడ భారీ ఆశలున్నాయి. అంచనాల మాట అటుంచి.. ఆశలు నెరవేరితే చాలన్నట్టుగా ఉంది హిందీ చిత్రపరిశ్రమ పరిస్థితి.
త్వరలో బ్రహ్మాస్త్ర సినిమా నే బాలీవుడ్ గతిని మార్చగలగాలి. ఈ ఏడాది చెప్పుకోదగ్గ విజయం భూల్ భులయ్యా 2 మాత్రమే. కనీసం బ్రహ్మాస్త్ర అయినా దానికి తోడయితే అదే ఊరట. అందులోనూ ఆ సినిమాను మూడు భాగాలుగా విడుదల చేస్తామంటూ ప్రకటించారు. మరి తొలి భాగం కనీస విజయాన్ని నమోదు చేస్తేనే మిగతా భాగాలకు అవకాశం ఉంటుంది.
అందులోనూ బాలీవుడ్ నుంచి రాబోతున్న పాన్ ఇండియా సినిమా ఇది! హిందీతో పాటు వివిధ భాషల్లో ఇది విడుదల అవుతోంది. ప్రత్యేకించి తెలుగులో ఈ సినిమాకు కొంత ఆసక్తి ఉంది. ఇలాంటి నేపథ్యంలో బ్రహ్మాస్త్ర గనుక విజయాన్ని అందుకుంటే.. బాలీవుడ్ కు ఊరట లభిస్తుంది.
ఇక వరసగా రీమేక్ సినిమాలు తేడా కొడుతున్న నేపథ్యంలో అల వైకుంఠపురంలో రీమేక్ పరిస్థితి ఏమిటనేది ఆసక్తిదాయకంగా మారింది. ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి కావొస్తోంది. కార్తిక్ ఆర్యన్ హీరో గా రూపొందిన ఈ సినిమా తెలుగులో సంక్రాంతి ఊపు, పాటలు, ఫన్ తో నడిచిపోయింది. మరీ రీమేక్ చేసుకునేంత మ్యాటర్ లేని పాతచింతకాయ పచ్చడి. ఆ పచ్చడిని హిందీ లో ఏ మేరకు యథాతథంగా వండుతారనేది పెద్ద డౌట్.
ఇది వరకూ సౌత్ లో వచ్చిన చాలా డీసెంట్ హిట్ సినిమాలు హిందీలో తేడా కొట్టిన దాఖలాలున్నాయి. ప్రత్యేకించి రీమేక్ సినిమాలు వరసగా ఫెయిలవుతున్నా నేపథ్యంలో అల వైకుంఠపురంలో రీమేక్ పరిస్థితి ఆసక్తిని రేపుతోంది!