క్ష‌మాప‌ణ కోరిన బిగ్‌బాస్ ఫేమ్ సుజాత

బిగ్‌బాస్ ఫేమ్ సుజాత‌ను బిట్టు నిలువునా ముంచాడు. ఇంత‌కూ ఈ బిట్టు ఎవరు? సుజాత‌ను ముంచ‌డం ఏంటి? అస‌లు వాళ్లిద్ద‌రి సంబంధం ఏంటి? ఇలా అనేక ప్ర‌శ్న‌లు, అనుమానాలు మ‌న‌సులోకి జొర‌బ‌డి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయా?…

బిగ్‌బాస్ ఫేమ్ సుజాత‌ను బిట్టు నిలువునా ముంచాడు. ఇంత‌కూ ఈ బిట్టు ఎవరు? సుజాత‌ను ముంచ‌డం ఏంటి? అస‌లు వాళ్లిద్ద‌రి సంబంధం ఏంటి? ఇలా అనేక ప్ర‌శ్న‌లు, అనుమానాలు మ‌న‌సులోకి జొర‌బ‌డి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయా? ఆ విష‌యాలేంటో తెలుసుకుందాం.

బిగ్‌బాస్ రియాల్టీ షో సీజ‌న్‌-4 ప్ర‌స్తుతం తెలుగులో న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. ఐదో వారం వ‌చ్చే స‌రికి బిగ్‌బాస్ ఇంటి నుంచి సుజాత బ‌య‌టికి రావాల్సి వ‌చ్చింది. ప్ర‌ధానంగా ఆమె బ‌య‌టికి రావ‌డానికి ఆమె న‌వ్వుతో పాటు హోస్ట్ నాగార్జున‌ను బిట్టు అని పిల‌వ‌డ‌మే అనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఆమె న‌వ్వు తెచ్చి పెట్టుకున్న‌దే త‌ప్ప‌, స‌హ‌జ సిద్ధంగా ఉండ‌డం లేద‌నేది ఎక్కువ మంది అభిప్రాయం.

ఇదిలా ఉంటే త‌న ఎలిమినేష‌న్ చాలా బాధ క‌లిగించింద‌ని, అస‌లు ఊహించలేద‌ని సుజాత హోస్ట్ నాగార్జున‌తో చెప్పి ఆవేద‌న వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. బిగ్‌బాస్ హౌస్ నుంచి బ‌య‌టికొచ్చిన సుజాత త‌న ఎలిమినేష‌న్‌కు ప్ర‌ధానంగా నాగార్జున‌ను బిట్టూ అని పిల‌వ‌డ‌మే అనే వాస్త‌వాన్ని తెలుసుకున్నారు. దీంతో ఈ విష‌య‌మై ఆమె స్ప‌ష్ట‌త ఇచ్చారు. ఒక ఇంట‌ర్వ్యూలో   ఆ విష‌య‌మై సుజాత ఏం చెప్పారంటే…

“నాగార్జున అంటే ఇష్ట‌మా అని  బిగ్‌బాస్ టీం న‌న్ను అడిగింది. ఇష్టమే అని చెప్ప‌డంతో పాటు ఆయ‌న చేసిన 'మ‌నం' సినిమా, బిట్టు పాత్ర మ‌రీ మ‌రీ ఇష్ట‌మ‌ని చెప్పాను. దీంతో బిట్టు అని పిల‌వ‌డానికి నీకు ఇష్ట‌మేనా అని అడిగారు. అందుకు స‌రేన‌న్నాను. నేను అలా పిలిచిన‌ప్పుడు కూడా నాగార్జున స‌ర్ చాలా సంతోషప‌డ్డారు. 

ఒక‌వేళ అలా పిల‌వ‌డం నాగార్జున‌కు గానీ, బిగ్‌బాస్ టీమ్‌కు కానీ న‌చ్చ‌క‌పోతే వెంట‌నే క‌న్ఫెష‌న్ రూమ్‌లోకి పిలిచి వ‌ద్ద‌ని చెప్పేవాళ్లు. కానీ వాళ్లంత‌ట వాళ్లే బిట్టు అని పిల‌వ‌మ‌న్నారు” అని సుజాత చెప్పుకొచ్చారు.

బిట్టు అని పిల‌వ‌డం ఆయ‌న అభిమానుల‌కు బాధ క‌లిగించి ఉంటే క్ష‌మించాల‌ని, తాను కావాల‌ని మాత్రం పిల‌వ‌లేదని సుజాత వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న చందంగా  న‌ష్టం జ‌రిగిపోయిన త‌ర్వాత ఇప్పుడు ఏమ‌నుకున్నా ఏం ప్ర‌యోజ‌నం! అందుకే అత్యుత్సాహానికి పోతే అస‌లుకే ఎస‌రు వ‌స్తుంద‌ని పెద్ద‌లు ఊరికే చెప్ప‌లేదు. 

బ‌హుశా తానేం న‌ష్ట‌పోయింది సుజాత‌కు ఇప్పుడు తెలిసి వుంటుందేమో. జీవితంలో ప్ర‌తి చేదు ఘ‌ట‌న‌ను గుణ‌పాఠంగా తీసుకుని ముందుకు పోవ‌డం త‌ప్ప మ‌రో ప్ర‌త్యామ్నాయం లేదు క‌దా!

ఇంకెన్ని రహస్య జీవోలు, వ్యవహారాలున్నాయో