భారతీయ జనతా పార్టీలోకి చేరిన నటి కుష్బూ అత్యుత్సాహం తమిళనాట కొత్త వివాదానికి తెర లేపింది. బీజేపీలోకి చేరిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా నిందించేసింది కుష్బూ. మొన్నటి వరకూ ఈమె బీజేపీని నిందించేది. ఇప్పుడు కాంగ్రెస్ ను టార్గెట్ చేసింది. బీజేపీని నియంతృత్వ పార్టీ అంటూ విమర్శించిన కుష్బూ, ఇప్పుడు కాంగ్రెస్ ను 'మానసిక వికలాంగ పార్టీ' అంటూ నిందించింది.
ఇదే వివాదాస్పదం అవుతోంది. ఇప్పటికే సభ్య సమాజం ఇలాంటి పదాలను నిషేధించింది. వికలాంగులు అనే మాటే లేదిప్పుడు. వారిని దివ్యాంగులుగా వ్యవహరిస్తూ ఉంది ప్రపంచం. మానసిక, శారీరక ఇబ్బందులతో ఉన్న వారిని అలా పిలవకూడదని ప్రపంచమే ఒక నియమం పెట్టుకుంది. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని నిందించడానికి 'మెంటల్లీ రిటార్టెడ్' అంటూ కుష్బూ వ్యాఖ్యానించడం వివాదంగా మారింది.
దీనిపై తమిళనాడు దివ్యాంగుల సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ పార్టీ పై ఆమెకు ఏదైనా కోపం ఉంటే మరోలా తిట్టుకోవాల్సిందని, మధ్యలో తమను కించపరిచే మాటలు ఎందుకు ఉపయోగించినట్టు? అంటూ దివ్యాంగులు ఫిర్యాదు చేశారు. రాజ్యాంగం ప్రకారం కూడా.. దివ్యాంగులను నిందించడం నేరం. ఈ నేపథ్యంలో.. కుష్బూపై కేసు తప్పేలా లేదు. కుష్బూ మాటలు వివాదాస్పదం కావడం కొత్తేమీ కాదు!