జగత్ జజ్జరిక అంటూ సిల్వర్ స్క్రీన్ పై సూపర్ హిట్ కొట్టిన కల్యాణ్ రామ్, తన మేజిక్ ను స్మాల్ స్క్రీన్ పై కూడా రిపీట్ చేశాడు. కల్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార సినిమా బుల్లితెరపై కూడా సూపర్ హిట్టయింది. ఈ సినిమాకు డబుల్ డిజిట్ రేటింగ్ వచ్చింది.
ఫిక్షనల్ టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన బింబిసార సినిమాను జీ తెలుగులో ప్రసారం చేశారు. ఈ సినిమాకు 11.5 టీఆర్పీ వచ్చింది. రీసెంట్ గా కల్యాణ్ రామ్ నటించిన ఏ సినిమాకూ ఈ స్థాయిలో రేటింగ్ రాలేదు. అలా వెండితెరపైనే కాకుండా, టీవీల్లో కూడా సూపర్ హిట్ కొట్టాడు కల్యాణ్ రామ్.
టఫ్ కాంపిటిషన్ మధ్య రిలీజైంది బింబిసార సినిమా. ఈ సినిమాకు ముందు-వెనక ప్రతి వారం ఓ పెద్ద సినిమా రిలీజైంది. బింబిసారకు ముందు రామారావు ఆన్ డ్యూటీ, థ్యాంక్ యు, వారియర్ లాంటి సినిమాలు.. బింబిసార తర్వాత మాచర్ల నియోజకవర్గం, కార్తికేయ-2 సినిమాలొచ్చాయి. ఇక బింబిసారతో పాటు సీతారామం కూడా రిలీజైంది. ఇంత గట్టి పోటీ మధ్య కూడా బింబిసార నిలబడింది.
కల్యాణ్ రామ్ కెరీర్ లోనే బింబిసారను రిస్కీ ప్రాజెక్టుగా చెబుతారు. కల్యాణ్ రామ్ మార్కెట్ ను మించిన బడ్జెట్ తో, ఓ కొత్త దర్శకుడితో తీసిన భారీ సినిమా ఇది. కేవలం కంటెంట్ పై నమ్మకంతో ఇంత రిస్క్ చేసి హిట్ కొట్టాడు కల్యాణ్ రామ్.