ఆ సినిమా ఓట్ల కోసం విద్వేషాల కుట్రేనా?

ట్రైలర్ విడుదలైన తర్వాత.. ఎన్నికల నేపథ్యంలో సంచలనం సృష్టిస్తున్న సినిమా రజాకార్. నిజం రాజ్యంలో రజాకార్లు సాగించిన దుర్మార్గాలు కథాంశంగా ఈ సినిమా రూపొందింది. హిందువుల మీద అరాచకాలు, అత్యాచారాలకు యథేచ్ఛగా పాల్పడినట్టుగా ఈ…

ట్రైలర్ విడుదలైన తర్వాత.. ఎన్నికల నేపథ్యంలో సంచలనం సృష్టిస్తున్న సినిమా రజాకార్. నిజం రాజ్యంలో రజాకార్లు సాగించిన దుర్మార్గాలు కథాంశంగా ఈ సినిమా రూపొందింది. హిందువుల మీద అరాచకాలు, అత్యాచారాలకు యథేచ్ఛగా పాల్పడినట్టుగా ఈ చిత్రంలో చూపిస్తున్నారు. అప్పట్లో రజాకార్లు దుర్మార్గంగా వ్యవహరించారనే సంగతులు చరిత్రలో ఉన్నాయిగానీ.. ఈ చిత్రంలో వాటిని చాలా అతిశయంగా దుర్మార్గంగా చూపించారనే విమర్శలు వస్తున్నాయి. 

భారతీయ జనతా పార్టీ ముస్లిం విద్వేషాన్ని ప్రచారంలోకి తెచ్చి.. తద్వారా హిందూ ఓటు బ్యాంకును కొల్లగొట్టడానికి.. రాజకీయంగా తటస్థులైన హిందువుల్లో కూడా ముస్లింలపట్ల విద్వేషాన్ని నాటి.. సామాజిక వాతావరణాన్ని సర్వనాశనం చేయడానికి ఈ చిత్రం ద్వారా ప్రయత్నిస్తున్నదని విమర్శలు వస్తున్నాయి.

రజాకార్ సినిమా విడుదల నిలిపివేయాలంటూ.. భారత ఎన్నికల సంఘానికి, సెన్సార్ బోర్డుకు సీపీఐ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. పార్టీ ఎంపీ బినోయ్ విశ్వం, జాతీయ కార్యదర్శి నారాయణ ఈ మేరకు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఈ చిత్రం ద్వారా మతవిద్వేషాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని వారు అంటున్నారు. భాజపా నాయకుడు గూడూరు నారాయణ రెడ్డి ఆ సినిమాకు పెట్టుబడి పెట్టారంటున్న సీపీఐ నాయకులు, ఈ సినిమానే కమలదళంకుట్ర అన్నట్టుగా అభివర్ణిస్తుండడం విశేషం.

సాధారణంగా ఎన్నికల సమయంలో.. సినిమా మాధ్యమం ద్వారా కూడా ప్రజలను ఆకట్టుకోవడానికి పార్టీలు ప్రయత్నించడం చాలా సహజం. పార్టీలు స్వయంగా సినిమా నిర్మాణంలోకి రాకపోయినా.. ఆయా పార్టీల నాయకులు నిర్మాతలుగా రూపొందుతుంటాయి. 

గత ఎన్నికల సమయానికి.. వైఎస్సార్ పాదయాత్ర గురించి వచ్చిన ‘యాత్ర’ సినిమా గానీ, వర్మ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ వంటివి.. అచ్చంగా రాజకీయ ప్రయోజనాలను ఉద్దేశించినవే. అలాగే ఈ ఎన్నికలకు ముందుగా.. జగన్ జీవితంలోని ఘట్టాలను ఆధారంగా చేసుకుని ‘వ్యూహం’ సినిమాను రూపొందిస్తున్నారు. తెలుగుదేశం కూడా వైఎస్ జగన్ మీద నెగటివ్ ప్రచారంతో కొన్ని సినిమాలను సీక్రెట్ గారూపొందిస్తున్నట్టు కూడా తెలుస్తోంది.

ఇవన్నీ ఒక ఎత్తు కాగా, రజాకార్ చిత్రంగురించి మాత్రమే ఎక్కువ రాద్ధాంతం జరుగుతోంది. ఎంతో సున్నితమైన హిందూ ముస్లిం మత విద్వేషాలను రెచ్చగొట్టేలా, అబద్ధాలను కూడా జోడించి, అత్యంత క్రూరంగా ఈ చిత్రాన్ని రూపొందించారనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది.