చిరంజీవి కొత్త సినిమా పేరు వాల్తేరు వీరయ్య. సంక్రాంతికి రిలీజ్ అవుతోంది ఈ సినిమా. సాధారణంగా కథకు తగ్గట్టు టైటిల్స్ పెడతారు. ఈ సినిమా టైటిల్ కూడా కథకు తగ్గట్టే పెట్టారు. అయితే అంతకుమించి ఈ టైటిల్ వెనక స్టోరీ ఉందంటున్నాడు దర్శకుడు బాబి.
“వీరయ్య అనే టైటిల్ నాకు చాలా ఇష్టం. గతంలో వెంకీ మామ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు నాజర్ నాకు ఓ పుస్తకం ఇచ్చారు. అందులో వీరయ్య అనే క్యారెక్టర్ ఉంది. ఆ పేరు నాకు బాగా నచ్చింది. ఇది మాత్రమే కాదు, చిరంజీవికి తొలి ఫొటో షూట్ నిర్వహించిన వ్యక్తి పేరు కానిస్టేబుల్ వీరయ్య. ఆయన దగ్గరుండి చిరంజీవి ఫొటోలు తీయించారు, ఆ ఫొటోల వల్లనే చిరంజీవి మద్రాసు వచ్చారు. అందుకే నా సినిమా టైటిల్ లో వీరయ్య అనే పేరు ఉండాలని అనుకున్నాను.”
ఇలా వీరయ్య అనే పేరు వెనక నేపథ్యాన్ని బయటపెట్టాడు బాబి. చిరంజీవితో సినిమా అనగానే తనకు నాజర్ ఇచ్చిన పుస్తకం, చిరంజీవి జీవితానికి సంబంధించిన ఘటన గుర్తుకొచ్చాయని, అందుకే ఆ పేరుతోనే పాత్రను సృష్టించి, ఆ పేరునే టైటిల్ గా మార్చానని అన్నాడు.
ఈ సంక్రాంతి కానుకగా 13వ తేదీన థియేటర్లలోకి వస్తోంది వాల్తేరు వీరయ్య. శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. సినిమాపై భారీ అంచనాలున్నాయి.