హీరో కల్యాణ్ రామ్ నుంచి మరో విలన్ పుట్టుకొచ్చాడు. బింబిసార సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించిన ఈ హీరో, తన అప్ కమింగ్ మూవీ అమిగోస్ లో కూడా ఓ నెగెటివ్ రోల్ పోషించాడు. కొద్దిసేపటి కిందట రిలీజైన టీజర్ తో ఈ విషయాన్ని బయటపెట్టారు మేకర్స్.
అమిగోస్ లో ట్రిపుల్ రోల్ చేశాడు కల్యాణ్ రామ్. ఈ 3 పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్స్ ను ఇప్పటికే విడుదల చేశారు. ఒక పాత్రలో యంగ్ బిజినెస్ మేన్ సిద్దార్థ్ గా, మరో పాత్రలో అమాయకమైన మంజునాధ్ అనే యువకుడిగా కనిపించిన కల్యాణ్ రామ్.. మైఖేల్ అనే మూడో పాత్రలో నెగెటివ్ షేడ్స్ చూపించినట్టున్నాడు. తాజాగా రిలీజైన టీజర్ లో ఈ మేరకు కొన్ని క్లూస్ వదిలారు.
టీజర్ లో 3 పాత్రలు కలిసి నటించిన సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ టీజర్ కు జిబ్రాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరింది. టీజర్ చూస్తుంటే, ఇదొక యాక్షన్ థ్రిల్లర్ అనే విషయం అర్థమౌతోంది.
అమిగోస్ తో రాజేందర్ రెడ్డి దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. అషికా రంగనాధ్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాను వచ్చేనెల 10న విడుదల చేయబోతున్నారు.