సంక్రాంతి బరిలో పోటీపడుతున్న సినిమాల ట్రయిలర్స్ అన్నీ వచ్చేశాయి. వారసుడు, తెగింపు, వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, కల్యాణం కమనీయం సినిమాల ట్రయిలర్స్ రిలీజ్ అయ్యాయి. ఇక మిగిలింది బాక్సాఫీస్ ఫలితమే.
గమ్మత్తైన విషయం ఏంటంటే.. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఈ 5 సినిమాల ట్రయిలర్స్ లో కొత్తదనం మచ్చుకు కూడా కనిపించలేదు. పూర్తిగా సదరు హీరో ఇమేజ్ పై ఆధారపడి సినిమాలు తీసినట్టు ట్రయిలర్స్ చూస్తే అర్థమౌతోంది.
ఉదాహరణకు విజయ్, అజిత్ సినిమాల ట్రయిలర్స్ విషయానికే వద్దాం. అజిత్ అంటే యాక్షన్ హీరో. కాబట్టి తెగింపు ట్రయిలర్ లో యాక్షన్ మాత్రమే కనిపించింది. ట్రయిలర్ లో 90శాతం భాగమంతా చేతిలో గన్ తోనే కనిపించాడు అజిత్. ఇక విజయ్ సినిమా ట్రయిలర్ సంగతి అందరికీ తెలిసిందే. తెలుగులో చాలా సినిమాల్ని గుర్తుచేసేలా వారసుడు ట్రయిలర్ కట్ చేశారు. విజయ్ లుక్, గెటప్ లో కొత్తదనం భూతద్ధం పెట్టి వెదికినా కనిపించదు.
వారసుడు సినిమా ట్రయిలర్ లో విజయ్ లుక్, గెటప్ లో కొత్తదనం కోసం వెదకడం ఎంత మూర్ఖత్వం అవుతుందో.. వీరసింహారెడ్డి ట్రయిలర్ లో బాలయ్య నుంచి కొత్తదనం ఆశించడం కూడా అంతే అమాయకత్వం అనుకోవాలేమో. వీరసింహారెడ్డి ట్రయిలర్ లో సేమ్ ఓల్డ్ మేనరిజమ్స్ చూపించాడు బాలయ్య. అవే మూస ఫైట్స్, అవే రొటీన్ డైలాగ్స్.
ఇక వాల్తేరు వీరయ్య విషయానికొద్దాం. ఈ సినిమా రొటీన్ అనే విషయాన్ని స్వయంగా చిరంజీవి నోటి నుంచే విన్నాం. అలాంటప్పుడు ట్రయిలర్ లో కొత్తదనం ఆశిస్తే కామెడీ అనిపించుకుంటుంది. వాల్తేరు వీరయ్య ట్రయిలర్ ను, చిరంజీవి ఫ్యాన్స్ కోసం కట్ చేసినట్టుంది తప్ప, కంటెంట్ లో కొత్తదనం చూపించేలా అస్సలు లేదు. గతంలో రామ్ చరణ్, సల్మాన్ ఖాన్ తో కలిసి కనిపించిన చిరంజీవి, ఈసారి రవితేజతో కనిపించాడంతే.
ఇక సంక్రాంతి బరిలో చివరిగా వస్తున్న కల్యాణం కమనీయం కూడా రొటీన్ బాటలోనే సాగింది. ఈ సినిమా ట్రయిలర్ లో జెర్సీ, మజిలీ లాంటి సినిమాల ఛాయలు కనిపిస్తున్నాయి.
ఇలా సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాల ట్రయిలర్స్ లో కేవలం ఫ్యాన్స్ కోసం ఉద్దేశించిన కంటెంట్ తప్ప, కొత్తదనం కనిపించలేదు. సినిమాలు థియేటర్లలోకి వచ్చిన తర్వాత అసలు కంటెంట్ ఏంటనేది ఓ క్లారిటీ వస్తుంది.