ఇప్పుడన్నీ వ్యూస్ ప్రాతిపదికన మంచీచెడుల కొలతలు కొలుస్తున్నారు. ఎంత ఎక్కువ వ్యూస్ వస్తే…అంత మంచి ఐటమ్ లేదా వీడియోగా గుర్తింపు పొందుతాయి. ఏ మాత్రం నెటిజన్ల మనసును ఆకట్టుకున్నా…ఇక ఆ ఐటమ్ లేదా వీడియో తక్కువ సమయంలోనే బాగా వైరల్ అయి భారీ వ్యూస్‌ను దక్కించుకుంటుంది. వ్యూస్‌ను బట్టి ఆదాయం వస్తుండడంతో సహజంగానే అందుకు తగ్గ కంటెంట్‌తో ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇస్తుంటారు.
ఈ నేపథ్యంలో బాలీవుడ్ ర్యాపర్ బాద్‌షా వ్యూస్ ఉచ్చులో ఇరుక్కున్నాడు. నకిలీ ఫాలోవర్స్ స్కామ్‌లో ఇరుక్కుని, దాని నుంచి బయటపడే మార్గం కోసం దారులు వెతుక్కుంటున్నాడు. తన వీడియోలకు ఎక్కువ వ్యూస్ వచ్చేందుకు డబ్బు ఇచ్చి కొనుగోలు చేశారని ముంబై పోలీసులు అంటున్నారు.
దీంతో అతినికి ముంబై పోలీసులు సమన్లు కూడా జారీ చేశారు. సహజంగా ఎవరైనా తాము అప్‌లోడ్ చేసే వీడియోకు ఎక్కువ వ్యూస్ రావాలని ఆకాంక్షిస్తారు. కోరుకోవడంలో తప్పు లేదు. కానీ అందుకు వక్రమార్గాలను ఎంచుకుంటూనే తిప్పలు. ర్యాపర్ బాద్‌షా తన వీడియో రిలీజ్ చేసిన తొలి 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సంపాదించి ప్రపంచ రికార్డ్ బద్ధలు కొట్టాలనుకున్నాడు. అతని “పాగల్ హై” సాంగ్ వీడియోకు తొలి రోజే అత్యధికంగా 75 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
దీంతో తొలి 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన కొరియన్ బ్యాండ్ బీటీఎస్ వీడియో రికార్డును తన పాట బద్దలు కొట్టిందంటూ ర్యాపర్ ప్రకటించాడు. అయితే దీన్ని గూగుల్ ఖండించడంతో అసలు మోసం బయట పడింది. అత్యాశకు పోయిన ర్యాపర్ బాద్‌షా కోరికోరి సమస్యలు కొని తెచ్చుకున్నట్టైంది.
అతని ప్రకటనను గూగుల్ ఖండించిన నేపథ్యంలో ముంబై డీసీపీ నందకుమార్ ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ యూట్యూబ్‌లో తన వీడియో ద్వారా ప్రపంచ రికార్డులను బాద్‌షా బద్ధలు కొట్టాలనుకున్నట్టు చెప్పాడు. 7.2 కోట్ల వ్యూస్‌కు గానూ సదరు కంపెనీకి రూ.72 లక్షలు చెల్లించినట్టు చావు కబురు చల్లగా చెప్పాడు. అతని మిగతా పాటలు, వాటి వ్యూస్‌ను కూడా పరిశీలిస్తున్నట్టు డీసీపీ చెప్పుకొచ్చాడు.
కేవలం ఒక్క తప్పుతో అతని మొత్తం పనిని అనుమానించాల్సిన పరిస్థితి వచ్చింది. నిజంగా మిగిలిన వీడియోలకు ఎక్కువ వ్యూస్ వచ్చినా నమ్మలేని పరిస్థితి. ఇదిలా ఉండగా తాను వ్యూస్ కొనుగోలు చేసేందుకు రూ.72 లక్షలు చెల్లించినట్టు డీసీపీ చెప్పడాన్ని ర్యాప్ బాద్‌షా ఖండించాడు. అలాంటి పనులకు తానెప్పుడూ పాల్పడలేదని స్పష్టం చేయడం గమనార్హం. దొరికినోడే దొంగ అనే విషయాన్ని మరిచావా బాద్‌షా?