పోటీ చేసిన చోట తాను దారుణంగా ఓడిపోయారు. తన తమ్ముడు, జనసేన అధినేత పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. ఆ ఆక్రోశం పవన్ లో చాన్నాళ్లు ఉండిపోయింది. ఓటమికి కారణాలు విశ్లేషించే సమయంలో కూడా నెపం ఓటర్లపైకి నెట్టేశారు పవన్ కల్యాణ్. ఓటు నోటు బాగా పనిచేసిందని, డబ్బులకు ప్రజలు అమ్ముడు పోవడం వల్లే తాను ఓడిపోయానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు నాగబాబు వంతు వచ్చింది.
జనం తమని ఓడించలేదని, జనమే ఓడిపోయారనేది నాగబాబు వాదన. సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా ఓటర్లపై ఇలా పడి ఏడుస్తుంటారు మెగా బ్రదర్. ఎన్నికలైపోయి ఏడాదిన్నర కావస్తోంది. ఇంకా ఎన్నికల్లో ఓటు వేసిన జనాల్ని ఎందుకు నేరస్తులుగా చూస్తున్నారో నాగబాబుకే తెలియాలి.
గాడ్సే ఎఫెక్ట్ తో, తమ్ముడి చీవాట్లతో కొన్నిరోజులు జనసేనకు దూరంగా ఉన్న నాగబాబు.. ఇటీవల ఓ సమీక్షలో పాల్గొని మళ్లీ తెరపైకి వచ్చారు. అంతలోనే రాజకీయ కామెంట్లు షురూ చేశారు. “రాష్ట్రంలో అభివృద్ధి లేదు, కష్టం వస్తే ప్రభుత్వం పట్టించుకోవడంలేదు, అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వం.. అంటూ నిందించే హక్కు రెండు వేలు తీసుకుని ఓటు వేసిన నీకు లేదు” అంటూ ట్విట్టర్ లో ఓ పోస్టింగ్ పెట్టారు.
ఇంతకీ నాగబాబు ఉద్దేశం ఏంటి? రాష్ట్రంలో ప్రజలంతా రెండు వేల రూపాయలకు కక్కుర్తి పడి ఓటు వేసినట్టేనా? జనసేన నేతలు గెలవకపోతే అందరూ నోట్లకు అమ్ముడుపోయినట్టేనా?
ఆ విషయం పక్కనపెడితే, రాష్ట్రంలో అభివృద్ధిలేదు, ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది అనే స్టేట్ మెంట్ కి అర్థమేంటి? నవరత్నాల పథకాల ప్రయోజనాలు నాగబాబుకి కనిపించలేదా, రివర్స్ టెండరింగ్ తో అవినీతి మేటలు తొలగిస్తున్న జగన్ నీతి ఆయన చూడలేకపోతున్నారా? ఇంకెంతకాలం ఇలా జనంపై పడి ఏడుస్తావంటూ ఆల్రెడీ నాగబాబుకి సోషల్ మీడియాలో తలంటు మొదలైంది.