ఓ సినిమా ఇంటర్వెల్ లో మరో సినిమా ట్రయిలర్ లేదా టీజర్ వేయడం సహజం. ఆ సినిమా క్రేజ్ ను, తమ సినిమా కోసం వాడుకోవడం సర్వసాధారణం. ఇక్కడే కాస్త కొత్తగా ఆలోచించింది వాల్తేరు వీరయ్య యూనిట్. టీజర్ బదులు ఏకంగా లిరికల్ వీడియో ప్రసారం చేసింది.
అవతార్-2 ఇంటర్వెల్ లో వాల్తేరు వీరయ్య ప్రత్యక్షమయ్యాడు. అయితే టీజర్ తో కాదు, ఓ లిరికల్ వీడియో వేయడంతో ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు.
వాల్తేరు వీరయ్య సినిమా నుంచి సూపర్ హిట్టయిన బాస్ పార్టీ సాంగ్ లిరికల్ వీడియోను అవతార్-2 ఇంటర్వెల్ టైమ్ లో ప్రసారం చేస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా సెన్సార్ కూడా చేయించారు. ఓ లిరికల్ వీడియోను ఇలా సినిమా మధ్యలో ప్రచారం కోసం ప్రసారం చేయడం బహుశా ఇదే తొలిసారేమో.
సంక్రాంతి బరిలో చాలా పోటీ ఉంది. బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాతో పోటీపడుతోంది వాల్తేరు వీరయ్య సినిమా. అందుకే ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇలా బాస్ పార్టీ సాంగ్ ను థియేటర్లలో ప్రసారం చేయడంతో పాటు, అదే థియేటర్లలో వాల్తేరు వీరయ్య స్టాండీలు కూడా పెడుతున్నారు.
సంక్రాంతి కానుకగా జనవరి 13న వాల్తేరు వీరయ్య రిలీజ్ అవుతోంది. దీనికంటే 24 గంటల ముందు, అంటే జనవరి 12న వీరసింహారెడ్డి థియేటర్లలోకి వస్తోంది.