మరోసారి అధికారంలోకి రావడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గట్టి పట్టుదలతో పని చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన నవరత్నాల పేరుతో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వాటి లబ్ధిదారులనే నమ్ముకున్నట్టు ఆయన మాటలు చెబుతు న్నాయి. నాయకుడికి ఏదో ఒక నమ్మకం లేకపోతే… ముందుకు వెళ్లలేరు. ఫలితాలను పక్కన పెడితే, ప్రయత్న లోపం లేకుండా చేయడమే నాయకత్వ లక్షణం.
వైఎస్ జగన్, చంద్రబాబు, కేసీఆర్ ఇలా ఎవరైనా తమ ప్రయత్నాల్లో మాత్రం ఎక్కడా తక్కువ చేయరు. అసలు ఏ ప్రయత్నం చేయకుండా ఫలితం ఆశించే పవన్‌కల్యాణ్ లాంటి వాళ్లుంటారు. అది వేరే విషయం. జగన్ విషయానికి వస్తే… గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై ఆయన తరచూ సమీక్షిస్తున్నారు. దీన్నిబట్టి ఆయన ఎంత సీరియస్‌గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక సమీక్ష నిర్వహించారు.
‘ఎన్నికలకు ఇంకా 16 నెలల సమయం ఉంది. దయచేసి అందరూ గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై ధ్యాస పెట్టండి. ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికీ వెళ్లండి. ఏ ఇంటికైనా వెళ్లకపోతే.. మీరు తమ ఇంటికి రాలేదని, వారు మనకు వ్యతిరేకం అయ్యే అవకాశం ఉంది. వారు మనకు ఓటేయరని తెలిసినా వెళ్లండి. ఎందుకంటే వారికి ఎంతగా మంచి చేశామనే రికార్డులు మన దగ్గర ఉన్నాయి. వాటిని చిరునవ్వుతో వివరిస్తే, వారి మనసు మారొచ్చు’ అని జగన్ హితబోధ చేశారు.
గత మూడున్నరేళ్లలో ప్రజలకు వివరిస్తే వారు మరోసారి ఆశీర్వదించారనే నమ్మకం, విశ్వాసం జగన్ మాటల్లో కనిపిస్తోంది. అందుకే ఆయన పదేపదే తన పాలనలో మంచి జరిగితేనే ఓటు వేయాలని అభ్యర్థిస్తుంటారు. ఇదే సందర్భంలో మరో ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సంక్షేమ పథకాల లబ్ధి అందని గడపల పరిస్థితి ఏంటి? పక్కింటోళ్లకు భారీగా సంక్షేమ పథకాల ప్రయోజనం కలిగి, మనకు మాత్రం ఎలాంటి ఏం జరగలేదనే అసంతృప్తులను చల్లార్చడం వైసీపీ ప్రజాప్రతినిధులకు పెద్ద టాస్కే అని చెప్పొచ్చు.
సంక్షేమ పథకాలు అందని గడపలపై ప్రత్యేక దృష్టిని సారించాల్సిన అవసరాన్ని వైసీపీ ప్రజాప్రతినిధులు గుర్తించాలి. ఎందుకంటే ఒక ఇంటికి వెళ్లి, మరో ఇంటికి వెళ్లకపోతే కోపం వస్తుందని జగన్ అంటున్నారు. అలాంటిది ఆర్థిక ప్రయోజనాలు అందనప్పుడు మరెంతగా కోపం వస్తుందో జగన్ మొదలుకుని, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు గుర్తించి, దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. అందరికీ సంక్షేమ లబ్ధి అందించడం కూడా సాధ్యం కాదు.
అయితే కొందరి అభివృద్ధి కోరుకుంటారు. సాగు,తాగునీటి సౌకర్యం, విద్యావైద్య సౌకర్యాలు తదితర వాటిని ఆకాంక్షించే వారి సంఖ్య తక్కువేం కాదు. 175కు 175 అసెంబ్లీ స్థానాలు గెలవాలంటే అన్ని వర్గాల ప్రజల ఆదరాభిమానాలు పొందాల్సి వుంటుంది. అందుకే అన్ని వర్గాల ప్రజల హృదయాలను చూరగొనేలా పాలనా విధానాలు వుండాలి. అది తన పాలనలో ఎంత మాత్రం ఉందో జగనే ఆత్మపరిశీలన చూసుకోవాలి.