డియర్ కామ్రేడ్ ఫెయిల్ అయినప్పుడు కూడా విజయ్ దేవరకొండ ఇంత టెన్షన్ పడలేదు. కానీ వరల్డ్ ఫేమస్ లవర్ ఫెయిల్యూర్ మాత్రం ఇతడి కెరీర్ ను పూర్తిగా షేక్ చేయడం స్టార్ట్ చేసింది. ఈ సినిమా దెబ్బకు ఇప్పటికే విజయ్ చేయాల్సిన ఓ సినిమా (హీరో) ఆగిపోయింది. ఇప్పుడు లైగర్ సినిమాకు కూడా తిప్పలు తప్పేలా లేవు.
విజయ్ దేవరకొండ హీరోగా బాక్సింగ్ కాన్సెప్ట్ తో లైగర్ అనే సినిమా చేస్తున్నాడు పూరి జగన్నాధ్. తన కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీగా, పాన్-ఇండియా సినిమాగా దీన్ని మలుస్తున్నాడు. అయితే వరల్డ్ ఫేమస్ లవర్ ఫ్లాప్ అవ్వడంతో ఇప్పుడు పూరి కూడా ఆలోచనలో పడ్డాడు. విజయ్ మూవీకి భారీ బడ్జెట్ అవసరమా అనే దిశగా పూరి ఆలోచనలు సాగుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ విషయంలో సహ-నిర్మాత కరణ్ జోహార్, పూరిని గట్టిగా హెచ్చరించినట్టు తెలుస్తోంది.
నిజానికి తన సినిమాలకు పూరి ఎక్కువ ఖర్చు పెట్టడు. తక్కువ బడ్జెట్ లోనే ఎక్కువ క్వాలిటీ చూపించడం ఈ దర్శకుడి స్పెషాలిటీ. అయితే లైగర్ విషయానికొచ్చేసరికి మాత్రం పూరి చాలా లెక్కలు వేసుకున్నాడు. పైగా ఇస్మార్ట్ శంకర్ తో ఆల్రెడీ ఓ పెద్ద హిట్ కొట్టి ఉన్నాడు కాబట్టి, లైగర్ ప్రీ-రిలీజ్ బిజినెస్ కు ఇబ్బంది ఉండదు.
ఈ లెక్కలన్నీ వేసుకొని.. విజయ్ దేవరకొండ సినిమా కోసం ఫైనాన్స్ కింద భారీగా డబ్బు తీసుకొచ్చాడు పూరి జగన్నాధ్. కట్ చేస్తే, ఇప్పుడు దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో లైగర్ కు కూడా బడ్జెట్ కోతలు తప్పేలా లేవు. ఉన్నంతలో డీసెంట్ బడ్జెట్ లో ఈ సినిమాను పూర్తిచేయాలని పూరి-కరణ్-చార్మి నిర్ణయించారు.