‘తషాన్’ సినిమా కెరీర్‌తో పాటు నా జీవితాన్ని కూడా మారుస్తుందని భావించాను. నిజం చెప్పాలంటే ‘జబ్ వి మెట్’ నా కెరీర్‌ని మారిస్తే ….తషాన్ నా జీవితాన్ని మార్చేసింది. ఎందుకంటే ఆ సినిమాలో నేను నా కలల రాకుమారుడిని కలిశాను. అతన్నే ప్రేమించి, పెళ్లి చేసుకున్నాను’ అని బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ చెప్పారు. కరీనాకు కలల రాకుమారుడిని ఇచ్చిన సినిమాగా ‘తషాన్’ నిలిచిపోతుంది.
కరీనా కపూర్ హీరోయిన్‌గానే కాదు…నటుడు షాహిద్ కపూర్‌తో పీకల్లోతూ ప్రేమలో మునిగిన భగ్న ప్రేమికురాలిగా కూడా బాలీవుడ్‌లో ప్రచారం పొందారు. కొన్నేళ్ల పాటు డేటింగ్‌లో ఉంటూ చెట్టపట్టాలేసుకుని తిరిగారు. ఆకాశమే హద్దుగా విహరించారు. ఏమైందో కానీ, వ్యక్తిగత కారణాలతో విడిపోయారు. దీంతో కపూర్ల ప్రేమ కథ విఫలగాథ అయ్యింది.
అయితే కరీనా, షాహిద్ తమతమ వృత్తి, వ్యక్తిగత జీవితాల్లో బిజీగా ఉంటూ…సంతోషంగా కాలం వెళ్లదీస్తున్నారు. ఇటీవల కరీనా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాహిద్‌తో ప్రేమ, బ్రేకప్, సినిమా సంగతుల గురించి వివరించారు.
‘జబ్ వి మెట్’ సినిమా తన కెరీర్‌నే మార్చేసిందన్నారు. ఎందుకంటే ఆ సినిమాలో షాహిద్, తను కలిసి నటించడమే కారణమన్నారు. ఆ సినిమా కథను మొదట షాహిదే విన్నాడని, అమ్మాయి పాత్ర చాలా ఉన్నతంగా ఉంటుందని, నటించాలని తనకు సలహా ఇచ్చాడన్నారు. ఆయన సలహా మేరకే ఆ సినిమాలో నటించినట్టు కరీనా తెలిపారు.
అయితే విధి తమ ఇద్దరి జీవితాలకు సంబంధించి ముందే ఓ రాత రాసిందని కరీనా చెప్పుకొచ్చారు. ‘జబ్ వి మెట్’, ‘తషాన్’ సినిమాల మధ్య మా జీవితాల్లో విధి ముందస్తు ప్రణాళికలో భాగంగా తాము విడిపోయినట్టు చెప్పారామె. తషాన్ సినిమాలో సైఫ్‌ను కలిశానన్నారు. తషాన్ సినిమా నా జీవితాన్ని మార్చేసిందన్నారు. నా కలల రాకుమారుడిని ఇచ్చిందని ఆమె చెప్పుకెళ్లారు.