ప్రతీ దానికి ఒక సమయం ఉంటుంది. ఎపుడు పడితే అపుడు అసందర్భంగా చేసే ప్రకటనలు చివరికి వికటిస్తాయి. మరి రాజకీయాల్లో జూనియర్ అయిన నారా వారబ్బాయి వారాలూ వర్జాలూ చూసుకోకుండా ఇవీ నా ఆస్తులంటూ హడావుడిగా ప్రకటించేశారు. దాన్ని ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇదే కరెక్ట్ అంటున్నారు.
సరే ఆయన చెప్పారు కాబట్టి అదే రైట్ అనుకున్నా ఇపుడెందుకు ఆస్తులు ప్రకటించారన్న దాని మీదనే పలు రకాల డౌట్లు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా అధికార వైసీపీ పార్టీ నేతలైతే అంత అర్జెంట్ గా ఆస్తుల ప్రకటన ఎందుకు లోకేశా అంటున్నారు.
ఓ వైపు ఏపీలో టీడీపీ సన్నిహితుల ఇళ్ళల్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఆ రాజకీయ రచ్చ అలా ఉన్న వేళ హఠాత్తుగా లోకేష్ ఆస్తులు ప్రకటించడంతో వైసీపీ నేతలు హాట్ కామెంట్స్ చేస్తున్నారు.
మంత్రి బొత్స సత్యనారాయణ అయితే ఆస్తుల ప్రకటన అంటూ లోకేష్ చేస్తున్న హడావుడిని తప్పుపట్టారు. ఎన్నికల వేళ ప్రతీ ఒక్కరూ అఫిడవిట్లు ఇచ్చి ఇవీ మా ఆస్తులని ప్రకటిస్తారని గుర్తు చేశారు.
మరి ఎన్నికల అఫిడవిట్లో ఆస్తుల విషయంలో చంద్రబాబూ, లోకేష్ ఇచ్చిన వివరాలు అన్నీ తప్పు అని చెబుతున్నారా అని బొత్స నిలదీస్తున్నారు. అఫిడవిట్లో ఇచ్చినవి, ఇపుడు ప్రకటించినవి ఈ రెండింట్లో ఏది కరెక్టో నారా ఫ్యామిలీలే చెప్పాలని ఆయన డిమాండు చేస్తున్నారు. మొత్తానికి నారా వారి ఆస్తుల ప్రకటనలోనూ రాజకీయమే కనిపిస్తోందని వైసీపీ నేతలు చెబుతున్నారు.