వలసలు అన్న పదమే అసహజం. ఎందుకంటే ఉన్న చోట బతుకు లేక వేరే చోటకు పోవడం అంటేనే అది దారుణం, అతి దుర్భరం. ఎక్కడికో పొట్ట చేత పట్టుకువెళ్ళిన వారు ఎప్పటికీ లోకల్ అనిపించుకోలేరు, పెద్దగొంతు చేయలేరు. ఎంతసేపూ అభద్రతాభావంతోనే బతకాలి.
ఇది కడుపు కోసం కష్టపడేవారికి వర్తించే నైతిక సూత్రం. అయితే మరో రకం వలసవాదులు ఉన్నారు. వారు రాజకీయాలను, భూములను, అభివ్రుధ్ధిని కబ్జా చేస్తూంటారు. వేరే చోట నుంచి వచ్చి లోకల్స్ ని సైతం పక్కకు నెట్టి తన పని కానిస్తూంటారు. వారికి ఏ బెరుకూ వణుకూ లేదు.
నిజం చెప్పాలంటే వారికి ఉన్నంత భద్రత లోకల్స్ అని చెప్పుకున్నవారికి ఉండదేమో. ఉత్తరాంధ్రా జిల్లాల్లో అలా వ్యాపారం, ఉపాధి పని మీద వచ్చిన వారు ఇపుడు పెద్దోళ్ళైపోయారు. ఎమ్మెల్యేలూ, ఎంపీలుగా, మంత్రులుగా అందలాలు ఎక్కేశారు.
వారి పల్లకీ మోసే కూలీలుగా ఉత్తరాంధ్రా జనం దశాబ్దాలుగా అలాగే మిగిలిపోతూ నలిగిపోతున్నారు. ఇపుడు విశాఖ రాజధాని అంటున్నారు. అది కనుక సాకారం అయితే వలస నేతలదే పండుగ. దాంతో మెల్లగా స్వరం పెంచుతున్నారు లోకల్ ప్రతినిధులు.
స్థానికులు కనుక ఒక్క అడుగు ముందు వేస్తే రాజకీయ వలసవాదులు పలాయనం చిత్తగించడం ఖాయమంటూ ఉత్తరాంధ్రా అధ్యయన వేదిక ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. మా భూములు, మా ప్రాంతం ప్రగతి, మా అవకాశాలు అన్నీ దోచుకున్నారు. ఇపుడు మా నీరు కూడా దోచేస్తూ మమ్మల్ని జీవశ్చవాలుగా మార్చేస్తున్నారంటున్నారు వేదిక కన్వీనర్ ప్రొఫెసర్ కే ఎస్ చలం.
ఎన్నాళ్ళు ఇలా అణగిమణగి ఉండాలి. మేము కనుక తలచుకుంటే వలసవాదం తోక ముడవాల్సిందేనని ఆయన గర్జించారు. గోదావరి జలాల్లో ఉత్తరాంధ్ర జిల్లాల వాటా తేల్చమంటున్న ఆయన అభివ్రుధ్ధితో పాటు, అందలాలలోనూ తమకు నూరు శాతం వాటా ఉందని,దాన్ని సాధించుకుంటమని అంటున్నారు.
మొత్తానికి వలసవాదంపై స్థానికి నినాదం బలంగా గర్జిస్తే వెనకబడిన జిల్లాల్లో కొత్త రాజకీయం రాజ్యం చేస్తుందేమో. చూడాలి మరి ఆ రోజు ఎపుడు వస్తుందో.