2023 దీపావళి వచ్చేసింది. మరో నెలన్నరలో 2024 వచ్చేస్తుంది. 2023 గడచిపోయింది. మామూలుగా కాదు టాప్ హీరోల్లో నలుగురు హీరోల సినిమాలు లేకుండానే.
సంక్రాంతి అంటే మహేష్, బన్నీ ల సినిమాల విడుదల కామన్. అలాంటిది 2023 మొత్తం మీదే ఈ ఇద్దరి సినిమాలు లేవు. ఆర్ఆర్ఆర్ పుణ్యమా అని ఎన్టీఆర్ సినిమా చూసి ఎన్నాళ్లయిందో. 2023లో ఆయన సినిమా కూడా లేదు. ఆచార్య తరువాత రామ్ చరణ్ ను ఇప్పటి వరకు తెరపై చూడలేదు.
పాన్ ఇండియా, భారీ, క్రేజీ కాంబినేషన్లు తెచ్చిన సమస్య. ది నెక్ట్స్ లెవెల్ సినిమా అందించాలనే జాగ్రత్త వల్ల వచ్చిన సమస్య ఇది. అదే సమయంలో సక్సెస్ కొట్టి తీరాలి.. బ్లాక్ బస్టర్ ఇవ్వాల్సిందే అనే బలమైన సంకల్పం కూడా. అందుకోసమే ముందుగా దర్శకులను వెదుక్కుంటున్నారు.
వాళ్ల దగ్గర నుంచి తనకు, తన లెవెల్ కు సరిపడా కథ కోసం చూస్తున్నారు. ఆ తరువాత అక్కడితో సరిపోవడం లేదు. హీరోయిన్, టెక్నికల్ కాస్ట్ అండ్ క్రూ దగ్గర ఎంచి ఎంచి చూడాల్సి వస్తోంది. వాళ్ల డేట్ లు దొరకాలి.
కాంబినేషన్ లు, ఇలా ప్రతి ఒక్కటీ సెలెక్టివ్ గా చూడాల్సి వస్తుంటే నిర్మాణాలు ఆలస్యం అయిపోతున్నాయి. ఒక్కో సినిమా ఏడాది నుంచి రెండు, మూడేళ్లు పట్టేస్తోంది. దాంతో 2023లో ఫ్యాన్స్ కు తమ తమ హీరోల సినిమాలే లేకుండా అయిపోయాయి.
2024లో బన్నీ, ఎన్టీఆర్, చరణ్, మహేష్ ల సినిమాలు వరుసగా వచ్చేస్తాయి. సంక్రాంతి నుంచి దసరా వరకు వీళ్ల ఫ్యాన్స్ దే హవా అంతా.