నిర్మాత దిల్ రాజుపై మరో నిర్మాత సి.కల్యాణ్ విరుచుకుపడ్డారు. ఆయన స్థాపించిన గిల్డ్ నుంచి చేస్తున్న సినిమాల వరకు అంశాల వారీగా దిల్ రాజును ఏకి పడేశారు. దిల్ రాజు వద్ద ఇండస్ట్రీకి ఎలాంటి ఉపయోగం లేదనేది సి.కల్యాణ్ వాదన.
“గిల్డ్ అనేది నా మైండ్ లో ఎప్పుడూ లేదు. దిల్ రాజు మొహం ముందే నేను ఈ మాట చెప్పాను. ఇలాంటి గిల్డ్ లు వంద వచ్చి వెళ్లిపోతుంటాయి. వాళ్ల అవసరాల కోసం వాళ్లు మాట్లాడుకుంటారు. ఇండస్ట్రీకి పనికొచ్చేదేం ఉండదు. ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ నుంచి డబ్బులొస్తున్నాయని దొడ్డి దారిలో చేసుకుంటున్నది ఇది. ఇంతకుముందు ఓ ఆర్గనైజేషన్ ఇలానే చేసింది. అప్పుడేమైందో అందరికీ తెలుసు. వాళ్లలో వాళ్లు పంచుకున్నారు, కొట్టుకున్నారు, క్లోజ్ చేశారు. ఇప్పుడు అదే గిల్డ్ అని వచ్చింది. రేపు బొల్డ్ అని వస్తుంది, ఎల్లుండి అల్డ్ అంటూ వస్తుంది.”
గిల్డ్ అనేది నిలబడదని, ఎప్పటికైనా ఫిలిం ఛాంబరే ఉంటుందని, కానీ కొంతమంది ఛాంబర్ వాల్యూ తీసేశారని ఆరోపించారు సి.కల్యాణ్. ఇక దిల్ రాజు విషయానికొస్తే, ఇండస్ట్రీకి పనికొచ్చే నిర్ణయం ఒక్కటి కూడా ఆయన తీసుకోలేదన్నారు.
“పెద్ద ప్రొడ్యూసర్లు అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్లు తమ సినిమాల శాటిలైట్ అమ్మాలంటే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లెటర్ కావాలి. ఫారిన్ షూట్ కు వెళ్లాలంటే కౌన్సిల్ లెటర్ కావాలి. మరి గిల్డ్ అని చెప్పుకుంటున్నారు కదా, వాళ్లు లెటర్లు ఇచ్చుకోవచ్చు కదా. అలా ఇవ్వలేరు, ఎందుకంటే గిల్డ్ కు ఎలాంటి విలువ లేదు. ఇక దిల్ రాజు విషయానికొస్తే, బాధ్యాతయుత పదవిలో ఉన్న వ్యక్తి త్యాగం చేయాలి. దిల్ రాజు ఇండస్ట్రీకి పనికొచ్చే నిర్ణయం ఏ రోజూ తీసుకోలేదు. ఇండస్ట్రీకి ఏమీ చేయలేదు. దిల్ రాజు పర్సంటేజీల గురించి మాట్లాడదాం అంటాడు, శిరీష్ వచ్చి నువ్వెవడ్రా నన్ను అడిగిదే అంటాడు.”
దిల్ రాజు కేవలం తన అవసరాల కోసం ఇండస్ట్రీని వాడుకుంటున్నాడని ఆరోపించారు సి.కల్యాణ్. నైజాంలో మైత్రీ నిర్మాతలు డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ తెరిచారంటే, అది కేవలం దిల్ రాజు స్వయంకృతాపరాధం అన్నారు. వారసుడు సినిమా విషయంలో దిల్ రాజు రెండు నాల్కల ధోరణి అవలంబించడం వల్లనే ఎగ్జిబిటర్లు, మిగతా డిస్ట్రిబ్యూటర్లకు శత్రువుగా మారాడన్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్ లో సినీపరిశ్రమ అభివృద్ధిపై కూడా సి.కల్యాణ్ నిర్మోహమాటంగా స్పందించారు. ఆంధ్రాలో కూడా తెలుగే మాట్లాడతారని, కాబట్టి అక్కడ టాలీవుడ్ అభివృద్ధి చెందదన్నారు. అంతేకాకుండా, తెలంగాణలో టాలీవుడ్ పాతుకుపోవడం వల్ల రాబోయే 8-9 ఏళ్లలో టాలీవుడ్ లో ఆంధ్రప్రదేశ్ ప్రాతినిథ్యం పూర్తిగా తగ్గిపోతుందని అన్నారు. ఏపీ నుంచి పరిశ్రమకొచ్చే నటులు, టెక్నీషియన్స్ తగ్గిపోతారని జోస్యం చెప్పారు.