ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ తమ్ముడు వినోద్ నుంచి తనకు ప్రాణహాని ఉందని జూనియర్ ఆర్టిస్ట్ దివ్య ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు ఆమె పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా తనను కులం పేరుతో దూషిస్తున్నాడంటూ తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు వరంగల్‌కు చెందిన దివ్య ఫిర్యాదు చేశారు.
వినోద్ ప్రేమ ప్రతిపాదనను తిరస్కరించడంతో తనను వేధిస్తున్నాడని ఆమె తెలిపారు. తనను లైంగికంగా వేధించడంతో పాటు వ్యభిచార కూపంలోకి దింపేందుకు వినోద్ ప్రయత్నిస్తున్నాడని దివ్య ఆరోపించారు. వినోద్ చీకటి వ్యాపారాల గురించి తనకు తెలుసునని, అందుకే తనను చంపాలని అతను కుట్రపన్నుతున్నాడని ఆమె ఆరోపించారు.
వినోద్ వేధింపులు ఎక్కువ కావడంతో, ఓపిక నశించి ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని ఆమె అన్నారు. కొన్ని రోజులుగా తనను కొందరు ఫాలో అవుతున్నారని, చంపుతారేమోనని భయంగా ఉందన్నారు.
దివ్య ఆరోపణలు పలు ప్రశ్నలు లెవనెత్తుతున్నాయి. అసలు దివ్య చెబుతున్నట్టు రాఘవ లారెన్స్ తమ్ముడు వినోద్ చేస్తున్న చీకటి వ్యాపారాలేంటి? ఆ విషయాలు దివ్యకు ఎలా తెలుసు? బాధితురాలు ఆరోపిస్తున్నట్టు వ్యభిచార కూపంలోకి ఎలా దింపగలడు? ఇంతకాలం వాళ్లిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఎక్కడ బెడిసికొట్టింది? తదితర ప్రశ్నలు అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. కానీ ఒక ఆడబిడ్డ తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసిన తర్వాత, వెంటనే పోలీసులు రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.