ఏ మెతుకు మీద ఎవరి పేరు రాసిపెట్టి వుందో అన్నట్లుగానే వుంటుంది టాలీవుడ్ లో కథల వ్యవహారం కూడా. ఎక్కడెక్కడో తిరుగుతాయి. ఎవరెవరో వింటారు. కొందరికి నచ్చవు. కొందరికి నచ్చినా తమకు నప్పదేమో అని ఫీలవుతారు. మరి కొందరు దాంట్లోని పాయింట్ పట్టుకోలేరు. ఆఖరికి ఎవరి దగ్గరికో వెళ్లి సెటిల్ అవుతుంది. హిట్ అయితే, అయ్యో.. వదిలేసామే అని అనుకుంటారు. ఫ్లాప్ అయితే మన జడ్జిమెంట్ పెర్ ఫెక్ట్ అనుకుంటారు. ఇలాంటివి చాలా ఉదాహరణలు వున్నాయి.
లేటెస్ట్ గా ఓ కథ శ్రీవిష్ణు దగ్గర నుంచి నాగ్ చైతన్య మీదుగా శర్వానంద్ దగ్గరకు వెళ్లి సెటిల్ అయిందట.సామజవరగమన సినిమాతో హిట్ కొట్టిన రాజ్ అబ్బరాజు ఓ మాంచి కథ తయారు చేసుకున్నారు. ఇద్దరు హీరోయిన్లు.. ఒక హీరో కథ. ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదు కానీ ఇది వేరే. ఆ కథ మరి శ్రీవిష్ణుకు ఎందుకో నచ్చలేదు. నాగ్ చైతన్య దగ్గరకు వెళ్లింది, అక్కడా ఎందుకో సెట్ కాలేదు. ఆఖరికి శర్వానంద్ ఓకె అన్నారు.
ఆసియన్ సునీల్ ఈ సినిమాను నిర్మిద్దాం అనుకున్నారు. దర్శకుడికి అనిల్ సుంకర అలాగే మరో నిర్మాత రాజా తో అగ్రిమెంట్ వుండడంతో, మాట్లాడి ఓకె అనిపించుకున్నారు కూడా. కానీ శర్వానంద్ రెమ్యూనిరేషన్ నే తొమ్మిది కోట్లు అని తెలియగానే ఆసియన్ సునీల్ ఇది వర్కవుట్ కాదని తప్పుకున్నారు. దాంతో అక్కడి నుంచి మైత్రీ దగ్గరకు వెళ్లి సెటిల్ అయింది.
కానీ అక్కడే వచ్చింది తకరారు. ఆసియన్ సునీల్ అంటే తమకు వున్న సంబంధాలతో ఓకె అన్నాం కానీ మైత్రీ కి ఎలా చేస్తారు. తమకే చేయాలి అంటూ పట్టుపడుతున్నారు సామజవరగమన నిర్మాతలు అనిల్ సుంకర, రాజా. కానీ వాళ్లకు చేయడానికి శర్వానంద్ అంత సుముఖంగా లేరని తెలుస్తోంది. మరో హీరో అందుబాటులో లేరు. ఈ హీరో వాళ్లతో చేయరు. అందువల్ల మైత్రీతో చేయడం తప్ప తనకు మార్గం లేదన్నది దర్శకుడి మాట.
తమకు అగ్రిమెంట్ వున్నందున తమతోనే చేయాలని, వేరే హీరోకి కథ చెప్పి ఒప్పించుకోమని అన్నది ఇటు వైపు వాదన. ఇది ఇప్పుడు చాంబర్ మెట్లు ఎక్కేలా కనిపిస్తోంది.