మోకాలికీ బోడిగుండుకీ ముడిపెట్టడంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును మించిన వారు లేరు. భూమిని ఆక్రమించుకొని ఇష్టారాజ్యంగా ఇల్లు కట్టేసుకుంటే, దానికి సంబంధించి పత్రాలపై ఫోర్జరీ సంతకాలు చేశావు అని పోలీసులు అరెస్టు చేస్తే.. ఆ నేరంతో సంబంధం లేకుండా దాని గురించి కాకుండా.. చంద్రబాబు నాయుడు ఏదేదో మాట్లాడుతుంటారు! ‘పోలీసులు వచ్చి అయ్యన్నపాత్రుడును అరెస్టు చేసిన వ్యవహారం ఒక హత్యాకాండ’ అన్నట్టుగా అభివర్ణించడంలో ఆయన ఆరితేరిపోయారు!
ఎన్నడో రఘురామకృష్ణం రాజును అరెస్టు చేసిన వ్యవహారాన్ని, రాజధానిలో ఒక మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించిన వైనాన్ని ఒకదానితో ఒకటి ఏమాత్రం సంబంధం లేకపోయినా వాటన్నింటినీ తీసుకువచ్చి అయ్యన్నపాత్రుడు ఎపిసోడ్ తో ముడిపెట్టి మాట్లాడడం చంద్రబాబుకు మాత్రమే చేతనైన విద్య! పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించినట్లుగా ఆ పార్టీ ఒక కొత్త పాట ఎత్తుకుంటే.. ఆ పాటకు సహవాయిద్యం వాయించడం చంద్రబాబు పని! పవన్ కళ్యాణ్ మీద ఈగ వాలినా సహించబోయేది లేదు అన్నట్లుగా ఈ వన్ సైడ్ లవ్ ప్రేమికుడు ఆరాటపడిపోతున్నాడు! ఆ రెక్కీ వ్యవహారాన్ని కూడా తీసుకువచ్చి అయ్యన్నపాత్రుడు ఎపిసోడ్ కు ముడి పెడుతున్నారు.. అందరినీ చంపేస్తారా అంటూ అర్థంపర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారు!
అయ్యన్నపాత్రుడు అనుమతులు లేకుండా కట్టినది నిజమా? కాదా?; అది తప్పా? కాదా?; సంతకం ఫోర్జరీ అనే సంగతి నిజమా? కాదా?; అనే సంగతులు వదిలేసి, నేరం ఎక్కడ ఉన్నదో ఆ అంశాలను మాత్రం పక్కన పెట్టేసి రాష్ట్రంలో మిగిలిన అన్ని వ్యవహారాలను చంద్రబాబు నాయుడు ప్రస్తావిస్తున్నారు. జగన్ మేనమామ వక్ఫ్ భూములను ఆక్రమించుకున్నారని కొత్త కథ చెబుతున్నారు. దానిమీద తాను ఫిర్యాదు చేస్తే సిఐడి పోలీసులు అరెస్టు చేస్తారా అని అంటున్నారు!.
సిఐడి పోలీసులు అరెస్టు చేస్తారో లేదో తర్వాతి సంగతి జగన్ బంధువులు ఆ విధంగా వక్ఫ్ భూములను అక్రమంగా అనుభవిస్తున్నారని చంద్రబాబు నాయుడుకు నిజంగా తెలిసి ఆధారాలు ఉంటే, ఇన్నాళ్లూ అసలు ఫిర్యాదు చేయకుండా ఎందుకున్నారు? అరెస్టు చేస్తానని బాండ్ పేపర్ రాసిస్తే తప్ప ఫిర్యాదు కూడా చేయరా? ఆయన ఫిర్యాదు చేసినా అరెస్టు చేయలేదని అనుకుందాం.. ఏకంగా కోరుకునే ఆశ్రయించవచ్చు కదా! ఆయన బాధ్యతగల ప్రజా ప్రతినిధి కదా!.
ప్రజల సొత్తుకు న్యాయం చేయడం ఆయన విధుల్లో భాగమే కదా? పైగా రవీంద్రనాథ్ రెడ్డి అనే ఆయన సినిమా హాళ్లను ఈ నాలుగేళ్లలో నిర్మించారా? ఎప్పుడు నిర్మించారు? నిర్మించిన తర్వాత చంద్రబాబు పాలన కూడా సాగింది కదా? ఈ అక్రమం నిజంగానే జరిగి ఉంటే తన పాలన కాలంలో కళ్ళు మూసుకుని గుడ్డిగా చంద్రబాబు ఎందుకు ఉండిపోయారు? ఇవన్నీ కూడా ప్రజల మధ్యలో మెదిలే ప్రశ్నలే!.
తమ పార్టీ నాయకుడి అక్రమ వ్యవహారాలను బయటపెట్టినప్పుడు వాటి మీద నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి చంద్రబాబు ఇలాంటి కుయుక్తులు పన్నుతున్నారు. ప్రజలు తన వేషాలను గమనించడం లేదని ఈ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనుకోవచ్చు గాక, కానీ వారికి చాలా క్లారిటీ ఉంటుందని, తన బుట్టలో పడరని ఆయన తెలుసుకోవాలి!