వైసీపీ శ్రేణుల్న ఎలా సంతృప్తి ప‌రుస్తారో?

వైసీపీ శ్రేణుల్ని సంతృప్తప‌ర‌చ‌డంపై చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఎందుకంటే క్షేత్ర‌స్థాయిలో పార్టీని మోసింది, మోసేది వాళ్లే. అలాంటి వాళ్లు ఆనందంగా వుంటేనే, మ‌ళ్లీ ఎన్నిక‌ల స‌మ‌రానికి స‌మాయ‌త్తం అవుతారు. ఇప్ప‌టి వ‌రకూ వాళ్ల‌ను ప‌ట్టించుకున్న దాఖ‌లాలు…

వైసీపీ శ్రేణుల్ని సంతృప్తప‌ర‌చ‌డంపై చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఎందుకంటే క్షేత్ర‌స్థాయిలో పార్టీని మోసింది, మోసేది వాళ్లే. అలాంటి వాళ్లు ఆనందంగా వుంటేనే, మ‌ళ్లీ ఎన్నిక‌ల స‌మ‌రానికి స‌మాయ‌త్తం అవుతారు. ఇప్ప‌టి వ‌రకూ వాళ్ల‌ను ప‌ట్టించుకున్న దాఖ‌లాలు లేవ‌న్న‌ది వాస్త‌వం. ప్ర‌స్తుతం అధికార పార్టీ పెద్ద స్థాయిలో మాత్ర‌మే పార్టీ కోసం ప‌ని చేసిన వాళ్ల‌ను గుర్తించి, గౌర‌విస్తోంది.

పార్టీ కోసం ప‌ని చేసిన వాళ్ల‌ను గుర్తించి, వారికి త‌గిన గౌర‌వాన్ని ఇచ్చేందుకు వైసీపీ స‌ర్కార్ వేగం పెంచింది. ఇందులో భాగంగా కీల‌క‌మైన నామినేటెడ్ పోస్టుల భ‌ర్తీ ప్ర‌క్రియ‌కు శ్రీ‌కారం చుట్టింది. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల కాలంలో ముఖ్యుల‌కు కీల‌క ప‌ద‌వీ బాధ్య త‌లు అప్ప‌గించ‌డం విశేషం.

అధికార భాషా సంఘం అధ్య‌క్షునిగా పి.విజ‌య‌బాబు, ఏపీ ప్ర‌భుత్వ ఎల‌క్ట్రానిక్ మీడియా స‌ల‌హాదారుగా సినీ న‌టుడు అలీ, ఏపీ స్టేట్‌ ఫిల్మ్‌ టెలివిజన్‌ అండ్‌ థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్ చైర్మన్‌గా న‌టుడు, ద‌ర్శ‌కుడు పోసాని కృష్ణ‌ముర‌ళి, ఏపీ ప్రెస్ అకాడ‌మీ చైర్మ‌న్‌గా సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ కొమ్మినేని శ్రీ‌నివాసరావును నియ‌మించారు. వీరంతా ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా వైసీపీ అధికారంలోకి దోహ‌దం చేసిన‌వారే.

పార్టీ కోసం ప‌ని చేస్తే గుర్తింపు, గౌర‌వం ద‌క్కుతుంద‌నే సంకేతాల్ని ప్ర‌జ‌ల్లోకి పంప‌డం ద్వారా రానున్న ఎన్నిక‌ల్లో రాజ‌కీయంగా ప్ర‌యోజ‌నం వుంటుంద‌ని వైసీపీ పెద్ద‌లు భావిస్తున్నారు. త‌ద్వారా రానున్న ఎన్నిక‌ల్లో వైసీపీ శ్రేణులు స‌మ‌రోత్సాహంతో ప‌ని చేసేందుకు స్ఫూర్తినిస్తుంద‌ని పార్టీ పెద్ద‌లు న‌మ్ముతున్నారు. పార్టీ కోసం ప‌ని చేసి, ఇంకా ఎవ‌రైనా ప‌ద‌వుల‌కు నోచుకోని వారున్నారా? అనే వెతుకులాట‌లో వైసీపీ ముఖ్య నేత‌లున్నారు.

నామినేటెడ్ పోస్టులు ఇవ్వ‌డానికి సాధ్యం కాని ప‌క్షంలో ఇత‌ర‌త్రా ఏం చేయొచ్చ‌నే కోణంలో క‌స‌ర‌త్తు చేస్తున్నార‌ని తెలిసింది. ఎలాగైనా మ‌ళ్లీ అధికారంలోకి రావాల‌నే ప‌ట్టుద‌ల‌తో వైసీపీ పెద్ద‌లున్నారు. గ‌త మూడున్న‌రేళ్ల పాల‌న‌లో బ‌ట‌న్ నొక్క‌డానికే ప్ర‌భుత్వం ఎక్కువ‌గా ప‌ని చేసింద‌నేది వాస్త‌వం. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు అనేక త్యాగాలు చేసిన వారికి ఒరిగిందేమీ లేద‌న్న అసంతృప్తి, ఆవేద‌న వుంది. నామినేటెడ్ పోస్టుల‌ను ప‌క్క‌న పెడితే, కిందిస్థాయిలో వైసీపీ శ్రేణుల్ని సంతృప్తిప‌రచ‌డంపై ఆ పార్టీ భ‌విష్య‌త్ ఆధార‌ప‌డి వుంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.