చంద్రబాబు పాత తరానికి, జగన్ నవతరం రాజకీయానికి ప్రతీకలు. చంద్రబాబుతో పోల్చుకుంటే జగన్ వయసులోనూ, అనుభవంలోనూ చాలా చిన్నవాడు. జగన్ తండ్రి దివంగత వైఎస్సార్ సమకాలికుడు చంద్రబాబు. రాజకీయాల్లో జగన్, చంద్రబాబు పంథాలకు చాలా వ్యత్యాసం వుంది. చావో రేవో తేల్చుకోవాలన్నట్టుగా జగన్ పోరాటం వుంటుంది. చంద్రబాబు మాత్రం నిదానమే ప్రధానం అన్నట్టుగా నడుచుకుంటుంటారు.
జగన్ దూకుడే ఆయన్ను రాజకీయంగా నిలబెట్టింది. జగన్‌పై వచ్చినట్టు విమర్శలు భారతదేశ రాజకీయ చరిత్రలో మరే నాయకుడిపై లేవు. 16 నెలల జైలు జీవితం గడిపి వచ్చిన తర్వాత కూడా ఆయన రాజకీయంగా మరింత గట్టిగా నిలబడగలి గారంటే, అదంతా ఆయన మనో నిబ్బరం, ఆత్మ విశ్వాసమే అని చెప్పాలి. చంద్రబాబులో ఇవి తక్కువగా వున్నాయి. చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పాన్ని జగన్ టార్గెట్ చేశారంటే, అదంతా ఆయన ఆత్మవిశ్వాసం ఘనతే.
గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా ఆలోచించలేదు. ఎవరూ కల కన్నది చేయడమే జగన్ లక్ష్యం. ఆ గుణమే ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. ఆ తెగువే కుప్పంలో చంద్రబాబు కోట కూలిపోతోందనే భయాన్ని టీడీపీలో కలిగించాయి. కుప్పంలోనే చంద్రబాబు ఏం చేయలేకపోతుంటే, ఇక మిగిలిన చోట్ల ఏం చేస్తారనే నిరాశ, నిస్పృహలను టీడీపీ వర్గాల్లో సృష్టించిన ఘనత ముమ్మాటికీ జగన్‌దే.
తన రాజకీయ అనుభవం అంత వయసు కూడా జగన్‌కు లేదని చంద్రబాబు పదేపదే విమర్శిస్తుంటారు. కానీ అలాంటి యువ నాయకుడినే అనుసరించాల్సిన దుస్థితి చంద్రబాబుకు ఏర్పడింది. బహుశా ఇలాంటి రోజు ఒకటి వస్తుందని చంద్రబాబు కలలో కూడా ఊహించి వుండరేమో. అంత కాల మహిమ. తన కోటను బద్ధలు కొడతానని జగన్ పదేపదే అంటుండడంతో చంద్రబాబు, ఆయన పార్టీ కార్యకర్తలు కూడా ఆత్మరక్షణలో పడ్డారు.
దీని నుంచి తాను తేరుకోవడంతో పాటు శ్రేణుల్లో కూడా ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు చంద్రబాబు కొత్త నినాదం ఎత్తుకున్నారు. కుప్పం సంగతి సరే, ఈ దఫా పులివెందుల్లో గెలువు చూద్దాం అని చంద్రబాబు సవాల్ విసురుతున్నారు. ఇక్కడ కూడా చంద్రబాబు పిరికితనాన్ని చూడొచ్చు. కుప్పంలో వైసీపీ గెలిచి తీరుతుందని జగన్ చాలా ధీమాగా చెబుతున్నారు. 175కు 175 స్థానాల్లో ఎందుకు గెలవలేమంటూ జగన్ ముందుకెళుతున్నారు.
కానీ పులివెందుల గురించి బాబు చెబుతున్నప్పుడు, ఆ భరోసా కనిపించలేదు. పులివెందుల్లో టీడీపీ గెలుస్తుందని ఆయన అనలేకపోతున్నారు. కనీసం మాట అనడానికి కూడా చంద్రబాబులో ధైర్యం లేదు. పులివెందుల్లో గెలిచి చూపాలని మాత్రమే జగన్‌ను ఆయన అడుగుతున్నారు. ఇదే జగన్, చంద్రబాబు మధ్య తేడా. ఇద్దరిలో తోపు ఎవరో, ఎందుకో అర్థం చేసుకోవచ్చు.