ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్టయిన ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ స్వాధీనం చేసుకోవడంపై చాలామంది అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మస్క్ రాకతో భావప్రకటన స్వేచ్ఛ హరించుకుపోతుందనే వాళ్లు కూడా ఉన్నారు. అయితే ఈ అసంతృప్తి, వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందనేది ఎవ్వరూ చెప్పలేకపోయారు. ఎట్టకేలకు ఆ పని పూర్తి చేసిపెట్టింది వీపీఎన్ఓవర్ వ్యూ అనే సంస్థ.
గూగుల్ ట్రెండ్స్ డేటాను ఆధారంగా చేసుకొని ఇదొక సర్వే రిపోర్ట్ తయారుచేసింది. ఈ నివేదిక ప్రకారం, ట్విట్టర్ ను “డిలీట్ చేయడం ఎలా” అనే ప్రశ్న టాప్ సెర్చ్ లో నిలిచిందట. మరీ ముఖ్యంగా అక్టోబర్ 24 నుంచి అక్టోబర్ 31 తేదీల మధ్య ఇలా సెర్చ్ చేసిన వారి సంఖ్య 500శాతం పెరిగిందంట.
దీంతో పాటు మరో పదబంధం కూడా బాగా వైరల్ అయిందట. అదే 'బాయ్ కాట్ ట్విట్టర్'. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 2 మధ్య బాయ్ కాట్ ట్విట్టర్ అనే పదం 4800శాతం ఎక్కువగా ట్రెండ్ అయిందని నివేదిక తెలిపింది. ఈ రెండు అంశాల ఆధారంగా ఎలాన్ మస్క్ రాకతో ట్విట్టర్ పై వ్యతిరేకత ఏ స్థాయిలో పెరిగిందో అంకెలతో వివరించింది సదరు సంస్థ.
మస్క్ రాకతో ట్విట్టర్ లో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అవన్నీ త్వరలోనే ఒక్కొక్కటిగా అమల్లోకి రాబోతున్నాయి. బ్లూ టిక్ కలిగిన వెరిఫైడ్ యూజర్లకు ఛార్జీలు విధించడం, ట్విట్టర్ లో పోస్ట్ చేసే వీడియో నిడివిని మరింత పెంచడం లాంటివి ఇందులో ముఖ్యమైనవి.
తాజాగా జరిగిన యాజమాన్యు మార్పు, త్వరలోనే జరగనున్న కీలక మార్పులతో, రాబోయే రోజుల్లో ట్విట్టర్ మనుగడ ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పటికే దీనికి, ఇనస్టాగ్రామ్ నుంచి గట్టి పోటీ ఉన్న సంగతి తెలిసిందే.