కొన్నాళ్ల కిందటి సంగతి. చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వెళ్లిన చాలా సినిమాలు బాక్సాఫీస్ బరిలో సక్సెస్ చూడలేకపోయాయి. దీంతో సోషల్ మీడియాలో ఆయనపై ఓ రకమైన నెగెటివ్ ప్రచారం జరిగింది. చిరంజీవి ప్రత్యేక అతిథిగా వస్తే, ఆ సినిమా సంగతి అంతే అనే సెంటిమెంట్ ను వ్యాప్తి చెందించారు. అదే టైమ్ లో బాలకృష్ణ ఎక్కువగా ఈవెంట్లలో కనిపించడం, అతడు ప్రత్యేక అతిథిగా హాజరైన సినిమాలు క్లిక్ అవ్వడం చకచకా జరిగిపోయాయి.
మళ్లీ ఇన్నాళ్లకు చిరంజీవి లక్కీ హ్యాండ్ గా మారారు. హను-మాన్ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు చిరంజీవి. కట్ చేస్తే, ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయింది. దీంతో చిరంజీవి మళ్లీ లక్కీ హ్యాండ్ గా మారారంటూ సోషల్ మీడియాలో పోస్టులు పడుతున్నాయి.
ప్రశాంత్ వర్మ చొరవతో హనుమాన్ సినిమాకు కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేసినప్పటికీ.. ప్రత్యక్షంగా ముందుకొచ్చి ప్రచారం చేసిన వ్యక్తి చిరంజీవి మాత్రమే. హను-మాన్ గురించి, తేజ సజ్జ గురించి చిరంజీవి మాట్లాడిన మాటలు సినిమా హిట్టయిన తర్వాత మరోసారి వైరల్ అవుతున్నాయి
ఈ నేపథ్యంలో, చిరంజీవిని కలిసి కృతజ్ఞతలు చెప్పాలని అనుకుంటోంది హను-మాన్ టీమ్. నిజానికి ఈ పనిని 2 రోజుల కిందటే చేయాలనుకున్నారు కానీ చిరంజీవి అందుబాటులో లేరు.
సంక్రాంతి సంబరాల కోసం మెగా కాంపౌండ్ మొత్తం బెంగళూరు వెళ్లింది. నిన్ననే వాళ్లంతా తిరిగి తమ నివాసాలకు చేరుకున్నారు. దీంతో వెంటనే అపాయింట్ మెంట్ తీసుకొని చిరంజీవిని కలవాలని అనుకుంటోంది హను-మాన్ యూనిట్. మొత్తమ్మీద హనుమంతుడి అనుగ్రహం సినిమా యూనిట్ తో పాటు, చిరంజీవికి కూడా కలిగిందని చెప్పుకోవాలి.