భోళాశంకర్ సెట్స్ లో ఉత్సాహంగా గడిపారు చిరంజీవి. ఇప్పటికే సినిమా నుంచి మేకింగ్ వీడియోస్ చాలా వచ్చాయి. వాటిలో చిరంజీవి జోష్ అంతా కనిపించింది. తాజాగా సెట్స్ లో జరిగిన మరో సరదా సంఘటనను పంచుకున్నారు మేకర్స్.
ఈ సినిమాలో చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. సెట్స్ లో తమన్నాను తమన్ అని పిలిచేవారంట చిరంజీవి. అలా భోళాశంకర్ సెట్స్ లో నిత్యం తమన్ పేరు వినిపించేదని చెప్పుకొచ్చింది తమన్నా.
“తమన్ ను ఎవరు పిలిచినా నన్ను పిలిచినట్టు అనిపిస్తుంది. ఆయన పేరు నా పేరు దాదాపు ఒకటే. సెట్స్ లో కూడా చిరంజీవి నన్ను తమన్ అని పిలిచేవారు. అలా మా సెట్స్ లో తమన్ పేరు ఎప్పుడూ వినిపించేది.”
ఇదే విషయాన్ని దర్శకుడు మెహర్ రమేష్ కూడా చెప్పుకొచ్చాడు. చిరంజీవి ఎప్పుడు తమన్ అని పిలిచినా, అతడు వచ్చాడేమోనని మెహర్ అటువైపు చూసేవాడంట. తీరా చూస్తే అక్కడ తమన్నా ఉండేది.
ఇక మిల్కీబ్యూటీ అనే ట్యాగ్ లైన్ పై కూడా స్పందించింది తమన్న. ఆ బిరుదు తనకు ఎలా వచ్చిందో ఇప్పటికీ అర్థం కాలేదన్న తమన్న.. కేవలం తన కలర్ చూసి ఆ బిరుదు ఇవ్వలేదని, తనపై ఉన్న ప్రేమను తెలుగు ప్రేక్షకులు అలా చూపించారని అభిప్రాయపడింది.
ఇన్నేళ్లకు తన బిరుదుపై ఓ సాంగ్ రావడంపై ఆనందం వ్యక్తం చేసింది తమన్నా. మెహర్ కు, సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్ కు, పాట రాసిన రామజోగయ్య శాస్త్రికి థ్యాంక్స్ చెప్పింది. ఈరోజు భోళాశంకర్ నుంచి మిల్కీబ్యూటీ అనే సాంగ్ లాంచ్ అయింది. తమన్ ఈ పాటను రిలీజ్ చేశాడు.