ఇప్పుడంటే సైరా లాంటి సినిమాలు చేసి చిరంజీవి కాస్త వెనక్కి తగ్గారు కానీ, ఒకప్పుడు చిరంజీవి అంటే మాస్, మాస్ అంటే చిరు. ఆ రేంజ్ లో ఉండే ఆయన సినిమాలు.
ముఠామేస్త్రి, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ లిస్ట్ చాలా పెద్దది. మరి ఇప్పుడు, ఈ కాలంలో, ఈ వయసులో చిరు నుంచి అలాంటి మాస్ సినిమా ఆశించొచ్చా? దానికి సమాధానమే ఈ కొత్త ప్రాజెక్టు.
చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా బాబి దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా సినిమా ఎనౌన్స్ చేసింది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. టైటిల్ చెప్పకపోయినా, దీనికి పూనకాలు లోడింగ్ అనే ట్యాగ్ లైన్ పెట్టేశారు. ఎందుకంటే, ఆ ప్రీ-లుక్ అలా ఉంది. మెడలో ఎర్ర కండువా, గళ్ల లుంగీ, ఓ చేతిలో బీడీ, సముద్రంలో పడవపై చిరు.. ఇన్నాళ్లుగా, ఇన్నేళ్లుగా ఫ్యాన్స్ ఎదురుచూస్తోంది ఇదే కదా అన్నట్టుంది ఈ ప్రీ-లుక్.
చిరంజీవికి సంబంధించి గాడ్ ఫాదర్ టైటిల్ మోషన్ పోస్టర్ వచ్చింది. ఆచార్య నుంచి మరో పోస్టర్ వచ్చింది. భోళాశంకర్ మోషన్ పోస్టర్ కూడా వచ్చింది. కానీ వాటి అన్నింటికంటే మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టరే అభిమానుల్ని ఎక్కువగా ఆకట్టుకుందంటే అతిశయోక్తి కాదు.
చిరు కెరీర్ లో 154వ ప్రాజెక్టుగా రాబోతున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించబోతున్నాడు. ఆచార్య తర్వాత చిరంజీవి చేస్తున్న స్ట్రయిట్ మూవీ ఇదే. మిగతా రెండూ రీమేక్ సినిమాలే.