చిరంజీవికి వంటలు కొత్తకాదు. తనకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా, ఒత్తిడి ఫీల్ అయినప్పుడల్లా గరిటె పడుతుంటానని ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు చిరంజీవి. మరీ ముఖ్యంగా అమ్మ కోసం వంట చేయడం తనకు ఇష్టమని చెప్పే చిరంజీవి.. ఆమధ్య తన తల్లి కోసం దోశలు చేసి పెట్టారు. ఈసారి ఏకంగా చేపల కూర వండారు.
చింత తొక్కుతో చిన్న చేపల గుజ్జు వేపుడు.. ఈ కర్రీ అంటే చిరంజీవి తల్లి అంజనాదేవికి చాలా ఇష్టం అంట. చిరంజీవి కోసం ఎప్పటికప్పుడు ఈ కర్రీని ఆమె చేసి పెట్టేదంట. అందుకే ఈసారి తల్లి కోసం చిరంజీవి ఆ కూర చేశారు. పేరు పొడుగ్గా ఉన్నా వంట సింపుల్ అంటున్నారాయన.
ఈ మేరకు చింత తొక్కుతో చిన్న చేపల గుజ్జు వేపుడు ఎలా చేయాలో.. దానికి కావల్సిన పదార్థాలేంటో అన్నీ వివరంగా చెబుతూ ఓ వీడియో చేశారు. నిజానికి ఈ వీడియోను నిన్ననే రిలీజ్ చేద్దామనుకున్నారు చిరు. కానీ విజయవాడ విషాదాన్ని దృష్టిలో పెట్టుకొని వాయిదా వేశారు. ఆ వీడియోను ఈరోజు కొద్దిసేపటి కిందట రిలీజ్ చేశారు.
మొత్తానికి ఈ వీడియోతో పూర్తిస్థాయిలో చెఫ్ గా మారిపోయారు చిరంజీవి. వంట పూర్తయిన తర్వాత అది ఎలా ఉందో చెప్పమంటూ తల్లిని కోరారు. ఓ రకమైన టెన్షన్ కు లోనయ్యారు. అన్నంలో చేపల కూర కలుపుకొని తిన్న అంజనా దేవి… బాగుందని చెప్పడంతో చిరంజీవి ఆనందానికి అవధుల్లేవు.