బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యను రాజకీయం చేస్తున్నారంటోంది నటి రియా చక్రబర్తి. ఈ విషయంలో కొన్ని మీడియా వర్గాలు ఆల్రెడీ తనను దోషిగా నిర్ధారించాయని, తన విషయంలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ వాపోతోంది రియా. ఈ మేరకు ఆమె మీడియా ట్రయల్ ను నిరసిస్తూ సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసినట్టుగా సమాచారం. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యను రాజకీయాల కోసం వాడుకుంటున్నారని, తనను అందులో ఇరికించి కొందరు పబ్బం గడుపుకుంటున్నారని అంటోంది రియా.
సుశాంత్ ఆత్మహత్యపై బిహార్ లో ఎఫ్ఐఆర్ నమోదు కావడం కూడా ఆ రాజకీయంలో భాగమే అని రియా ఆరోపిస్తోంది. రాజకీయాల కోసం తనను బలిపశువును చేశారంటూ రియా తన పిటిషన్లో పేర్కొందని సమాచారం. ఇది వరకూ 2జీ స్కామ్ తదితరాల్లో కూడా అనేక మందిని దోషులు అంటూ మీడియా ప్రచారం చేసిందని.. ఆ తర్వాత వాళ్లంతా నిర్దోషులంటూ కోర్టు తీర్పును ఇచ్చిందని రియా గుర్తు చేస్తోంది.
సీబీఐ, ఈడీ వంటి సంస్థలు జోక్యం చేసుకున్న ఏ కేసు కూడా ఇప్పటి వరకూ తుది దశకు రాలేదని.. వందల, వేల కోట్ల స్కామ్ లలో వాటి విచారణలు పూర్తి కాలేదని రియా కోర్టు దృష్టికి తీసుకెళ్లిందట. మొత్తానికి తనను రాజకీయం కోసం బలిపశువును చేశారంటూ రియా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఒకవైపు విచారణలకు హాజరవుతూ ఆమె ఈ పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం.