చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమా దారుణంగా ఫెయిల్ అయింది. మూడో రోజుతో పోలిస్తే, నాలుగో రోజైన నిన్న ఈ సినిమాకు వసూళ్లు 85 శాతం పడిపోయాయి. బిగ్గెస్ట్ డిజాస్టర్ దిశగా దూసుకుపోతున్న ఈ సినిమాను చూసి మెగా నిర్మాతలంతా ఇప్పుడు ఆలోచనలో పడ్డారు. చిరంజీవి సినిమాలపై ఎంత ఖర్చు చేయాలో మరోసారి లెక్కలేసుకుంటున్నారు. ఈ మేరకు ఆల్రెడీ కొన్ని ఊహాగానాలు కూడా మొదలయ్యాయి.
ప్రస్తుతం బాబి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు చిరంజీవి. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం రవితేజను తీసుకున్నారు. అతడికి భారీగా రెమ్యూనరేషన్ కూడా సెట్ చేశారు. ఆచార్య రిజల్ట్ తో ఇప్పుడా నిర్ణయంపై మేకర్స్ పునరాలోచిస్తున్నట్టున్నారట.
రవితేజ కాకుండా, మరో నటుడితో ముందుకెళ్తే ఎలా ఉంటుందో పరిశీలిస్తున్నారట. నిజానికి 'మైత్రీ' నిర్మాతలు ఖర్చుకు వెనకాడే రకం కాదు. కొత్త హీరో వైష్ణవ్ తేజ్ కే భారీగా ఖర్చుపెట్టిన ట్రాక్ రికార్డ్ వాళ్లకు ఉంది. కాబట్టి చిరు సినిమా విషయంలో వాళ్లు కాంప్రమైజ్ అవుతారని అనుకోలేం.
ఇక చిరంజీవి చేస్తున్న మరో సినిమా గాడ్ ఫాదర్. ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ సినిమాకు నిర్మాతలు. దీనికి సంబంధించి కాస్ట్ కటింగ్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే, దాదాపు సినిమా షూటింగ్ పూర్తయింది. మహా అయితే ప్రచార ఖర్చును కాస్త తగ్గించుకోవచ్చు. ఇక భోళాశంకర్ విషయంలో మాత్రం ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిందే.
ఎందుకంటే, మెహర్ రమేష్ ఈ సినిమాకు దర్శకుడు. అతడికి సరైన ట్రాక్ రికార్డ్ లేదు. పైగా లాంగ్ గ్యాప్ తర్వాత మెగాఫోన్ అందుకున్నాడు. ఈ సినిమా బడ్జెట్ విషయంలో చిరంజీవి, నిర్మాతలు కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం చాలా అవసరం. ఇక వెంకీ కుడుముల సినిమా ఇంకా సెట్స్ పైకి రాలేదు కాబట్టి, ఆ సినిమాలో భారీగా మార్పుచేర్పులు జరిగే అవకాశం ఉంది. వీటితో పాటు తన అప్ కమింగ్ మూవీస్ విషయంలో చిరంజీవి మరింత జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం ఉంది.