ఆర్ఆర్ఆర్ తో పెద్ద హిట్ కొట్టాడు రామ్ చరణ్. ఈ సినిమాతో అతడు గ్లోబల్ స్టార్ అనిపించుకున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలో పాటకు ఆస్కార్ కూడా వచ్చింది. ఈమధ్య వరుణ్ తేజ్ నిశ్చితార్థం కూడా జరిగింది. రామ్ చరణ్ కూతురు ప్రభావంతోనే మెగా కాంపౌండ్ లో ఈ శుభాలు జరిగాయని అభిప్రాయపడ్డారు చిరంజీవి.
“మాకు అన్నీ శుభాలే కనిపిస్తున్నాయి. ఆ ప్రభావం మాకు ముందు నుంచి చూపిస్తోంది. చరణ్ కెరీర్ పరంగా ఎదుగుతున్నాడు. మంచి విజయాలు సాధిస్తున్నాడు. ఈమధ్య వరుణ్ తేజ్ నిశ్చితార్థం జరిగింది. ఇలా అన్నీ శుభకార్యాలే జరుగుతున్నాయి. ఈ బిడ్డ ప్రభావం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయని నేను అనుకుంటున్నాను.”
ఈరోజు ఉదయం ఒంటిగంట 49 నిమిషాలకు చరణ్-ఉపాసన దంపతులకు ఆడబిడ్డ జన్మించినట్టు ప్రకటించారు చిరంజీవి. పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత చరణ్-ఉపాసన ఇలా తల్లిదండ్రులుగా మారడం చాలా అపురూపం అంటున్నారాయన.
“ఈరోజు ఉదయం 1.49 నిమిషాలకు రామ్ చరణ్, ఉపాసన ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ పుట్టుక మాకు ఎంతో అపురూపం. ఎన్నో సంవత్సరాలుగా చరణ్-ఉపాసన తల్లిదండ్రులు అవ్వాలని, మా చేతిలో ఓ బిడ్డను పెట్టాలని కోరుకుంటున్నాం. ఇన్నేళ్లకు నా కోరిక తీరింది. అందుకే ఇది మాకు చాలా అపురూపం.”
ఉపాసన కోసం ది బెస్ట్ వైద్య బృందాన్ని హైదరాబాద్ తీసుకొచ్చారంటూ వచ్చిన వార్తల్ని చిరంజీవి ధృవీకరించారు. ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని, అన్ని రకాలుగా కేర్ తీసుకోవాలనే ఉద్దేశంతో ది బెస్ట్ టీమ్ ను ఏర్పాటుచేశామని అన్నారు. మంగళవారం ఆడ బిడ్డ జన్మించడం, తమ కులదైవం ఆంజనేయస్వామి వరప్రసాదం అని పేర్కొన్నారు చిరంజీవి.