వాల్తేరు వీరయ్య సినిమాకు సంబంధించి రోజుకో తెరవెనుక కథ వెలుగులోకి వస్తోంది. సినిమాకు మంచి టాక్ రావడంతో, యూనిట్ సభ్యులంతా మరింతగా యాక్టివ్ గా అయ్యారు. సినిమా విశేషాల్ని ఒక్కొక్కటిగా పంచుకుంటున్నారు. ఇందులో భాగంగా ఓ వెరైటీ విషయాన్ని బయటపెట్టారు చిరంజీవి
వీరయ్య పాత్రలో చిరంజీవి పల్లీలు నములుతూ, పొట్టును మాస్ గా గాల్లోకి ఊదే సన్నివేశం ఉంది. ఈ సీన్ కోసం తన ఇంట్లో జరిగిన ఓ సరదా సంగతిని బయటపెట్టారు చిరంజీవి.
ఈ సీన్ కోసం ప్రత్యేకంగా పల్లీల పొట్టును ఇంట్లో సిద్ధం చేసుకున్నారట చిరంజీవి. ఇంట్లో పనిమనిషికి ఆ విషయం చెబితే, ఆశ్చర్యపోయిందని, పొట్టు ఇవ్వనని, కావాలంటే పల్లీలు ఇస్తానని ఆవిడ అనేసరికి తనకు ఏం చెప్పాలో అర్థంకాలేదన్నారు చిరంజీవి.
మొత్తమ్మీద ఆవిడకు ఏదో ఒకటి సర్దిచెప్పి, ఓ ప్యాకెట్ నిండా పల్లీల పొట్టు పట్టుకొని లొకేషన్ కు వెళ్లానని చిరంజీవి అన్నారు. పాత్ర విషయంలో తను అంత నిబద్ధతతో ఉన్నానని, షాట్ లో సమయానికి పల్లీల పొట్టు దొరక్కపోతే ఇబ్బంది అవుతుందని, ఇంటి నుంచి పొట్టు తీసుకెళ్లానని గుర్తుచేసుకున్నారు.
సినిమాలో బాడీ డబుల్ చేయడానికి కూడా తను అంగీకరించలేదన్నారు చిరంజీవి. వాటర్ సీక్వెన్స్ లో ప్రతి షాట్ లోనూ తను నటించడం చూసి కెమెరామెన్ ఆశ్చర్యపోయాడని, డూప్ పెట్టి తీసుకుందామని అతడు చెప్పినా తను వినలేదన్నారు. డబ్బులు తీసుకుంటోంది నటించడానికేనని, ఎంత కష్టమైనా పడతానని అన్నారు.