ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు బలం మొదటి నుంచి అంతంత మాత్రమే. అది ఆయన సొంత జిల్లా అయినప్పటికీ రకరకాల సమీకరణల రీత్యా టీడీపీ చెప్పుకోతగ్గ స్థాయిలో సత్తా చూపడం లేదు. అయితే తాజాగా టీడీపీని బలోపేతం కావడానికి వైసీపీ చర్యలే పనికొస్తున్నాయి. టీడీపీ తనకు తానుగా ఎలాంటి ప్రయత్నం చేయకపోయినా, వైసీపీపై వ్యతిరేకతే ప్రధాన ప్రతిపక్షం ఎదుగుదలకు దోహదం చేసేలా వుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల కుప్పంలో చంద్రబాబు పర్యటన సవ్యంగా సాగలేదు. ఇదే అవకాశంగా తీసుకుని చంద్రబాబు మూడు రోజుల పాటు కుప్పం కేంద్రంగా రాజకీయ యాగీ చేశారు. ఈ ఎపిసోడ్లో చంద్రబాబుకు మైలేజీ పెరిగింది. చివరికి సొంత నియోజకవర్గంలో కూడా చంద్రబాబును తిరగనివ్వరా? అనే ప్రశ్న పౌర సమాజం నుంచి వెల్లువెత్తింది. చంద్రబాబును రాజకీయంగా విభేదించే వాళ్లు కూడా… ఈ విషయంలో ఆయనకు మద్దతుగా మాట్లాడ్డం గమనార్హం.
తాజాగా మరో ఎపిసోడ్. రొంపిచర్ల ప్లెక్సీ వివాదంలో 8 మంది టీడీపీ కార్యకర్తల్ని అరెస్ట్ చేసి పీలేరు సబ్జైల్లో పెట్టడంపై చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సంక్రాంతి పండగ రోజు తమ కార్యకర్తల్ని జైలుకు పంపుతారా? అంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిపై చంద్రబాబు తీవ్రస్థాయిలో చెలరేగిపోతున్నారు. సబ్జైల్లో ఉన్న కార్యకర్తల్ని పరామర్శించడానికి స్వయంగా తానే సబ్‌జైలుకు చంద్రబాబు వెళ్లడం గమనార్హం.
ఇది తప్పకుండా వైసీపీకి నెగెటివ్‌తో పాటు టీడీపీకి సానుకూల అంశమే. ఇలాంటి ఘటనలనే చంద్రబాబు కోరుకుంటున్నారు. పైగా మైనార్టీలను వేధిస్తున్నట్టుగా చంద్రబాబు చిత్రీకరిస్తున్నారు. పీలేరులో చంద్రబాబు మాట్లాడుతూ జగన్‌తో పాటు మంత్రి పెద్దిరెడ్డిని తీవ్రస్థాయిలో హెచ్చరించడం గమనార్హం.
‘నా కార్యకర్తలను జైళ్లలో పెట్టారు పెద్దిరెడ్డీ.. పండగ పూట నా కార్యకర్తల కోసం జైలుకు వచ్చాను. నీ పని అయిపోయింది.. నీ పార్టీ పోతుంది. పెద్దిరెడ్డీ.. సైకో పోవాలి.. సైకిల్ రావాలి’ అని చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ ఇంత కాలం వ్యవహరించిన తీరు ఒక ఎత్తైతే, ఎన్నికలు సమీపిస్తున్న నడుచుకోవాల్సిన తీరు మరోలా వుండాలి. ఇప్పటికీ అక్రమ కేసులతో వేధిస్తున్నారనే భావన ప్రజల్లో కలిగితే మాత్రం అది అధికార పార్టీకి ముమ్మాటికీ నష్టమే.
గతంలో తన కుమారుడైన ఎంపీ మిథున్‌రెడ్డిపై చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసు పెట్టడాన్ని మంత్రి గుర్తు చేస్తున్న సంగతి తెలిసిందే. అందుకే చంద్రబాబు మూల్యం చెల్లించుకున్నారని మంత్రి గుర్తించుకోవాలి. ప్రతీకార చర్యలకు ఇది సరైన సమయం కాదని వైసీపీ నేతలు గ్రహిస్తే మంచిది. లేదంటే అందుకు తగ్గట్టు ప్రజలు తీర్పు ఇస్తారని గతానుభవాల నుంచైనా గుణపాఠాలు నేర్చుకోవాలి. చేజేతులా చంద్రబాబును బలోపేతం చేస్తున్న భావన ప్రజల్లో పెరుగుతోందన్నది వాస్తవం.