ఉత్తరాఖండ్ లోని జోషిమఠ్ ప్రాంతంలో భూమి కుంచించుకుపోతోంది. ఇళ్లు పగుళ్లు బారి పడిపోతున్నాయి. భూకంపం వచ్చినట్టు రోడ్లు నిట్టనిలువునా చీలిపోతున్నాయి. ఏం జరుగుతుందో తెలుసుకునేలోగా.. జనాలను అక్కడినుంచి తరలించేస్తున్నారు. చార్ థామ్ యాత్రకు జోషిమఠ్ కీలకం కావడంతో ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే జోషి మఠ్ తో పాటు మరికొన్ని ప్రాంతాలు కూడా ఇలా కుంగుబాటు ముప్పుని ఎదుర్కొంటున్నాయి.
జోషిమఠ్ లో నేల కుంగుబాటు మానవ తప్పిదమా లేక ప్రకృతి ప్రకోపమా అని అంచనా వేయడానికి ముందు అలాంటి ప్రదేశాలు ఇంకా ఎక్కడున్నాయనే వెదుకులాట మొదలైంది. ఇస్రోకి చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అంచనాల ప్రకారం మరిన్ని ప్రాంతాలకు ముప్పు ఉంది.
ఉత్తరాఖండ్ లోని తెహ్రీ ప్రాంతంలో కొన్ని ఇళ్లకు ఇప్పటికే పగుళ్లు వచ్చాయి. తెహ్రీ డ్యామ్ భారతదేశంలోని ఎత్తైన ఆనకట్ట, అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టులలో ఒకటి. ఇది ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం కూడా. హిమాలయ పర్వతాల పర్యావరణ వ్యవస్థలో ఈ ఆనకట్టతో ఆందోళన మొదలవుతోంది.
చైనాతో సరిహద్దులో ఉన్న చివరి గ్రామం మనా. 2020 వేసవిలో భారత్-చైనా సరిహద్దులో తాజా వివాదం చెలరేగిన తర్వాత ఈ గ్రామంలో భారత సైనిక దళాలను మోహరించారు. జోషిమఠ్ ద్వారానే ఇక్కడకు సైనికుల్ని తరలించారు. ఈ ప్రాంతంలో కూడా ఇప్పుడు ఇళ్ల కుంగుబాటు ఉదాహరణలు వెలుగులోకి వచ్చాయి.
హిమాలయాల సరిహద్దుల్లో భారత దళాలను మోహరించేందుకు ధారాసు పట్టణం కీలకంగా ఉంది. సరిహద్దుకు దళాలను, వారికి అవసరమైన సామగ్రిని తరలించేందుకు ఈ పట్టణాన్ని ఉపయోగించుకుంటున్నారు. కొండ అంచున ఉన్న ఈ పట్టణంలో సైనిక వాహనాల కోసం రోడ్లు విస్తరించారు. ఫలితంగా ఇక్కడ కూడా నేల కుంగుబాటుకు గురవుతోంది.
హిమాలయ తీర్థయాత్ర మార్గంలో ఉన్న మరో ముఖ్యమైన పట్టణం హర్షిల్. ఇది కూడా సైనిక కార్యకలాపాలకు ఉపయోగపడుతోంది. 2013లో ఉత్తరాఖండ్ లో వచ్చిన ఆకస్మిక వరదలకు ఈ ప్రాంతం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.
జోషి మఠ్ కు 100 కిలోమీటర్లో ఉన్న గౌచర్ గ్రామం.. చైనా సరిహద్దుకి 200 కిలోమీటర్ల దగ్గర్లో ఉంటుంది. 2013లో భారత వైమానిక దళం రెస్క్యూ ఆపరేషన్, ఎక్కువ భాగం ఈ పట్టణం నుంచే జరిగింది.
సైన్యానికి చెందిన పెద్ద విమానాల ల్యాండింగ్ కోసం భారీ ఎయిర్ స్ట్రిప్ ఉన్న పట్టణం పితోర్ ఘర్. మిలట్రీ కార్యకలాపాలకు ఇది ముఖ్యమైన పట్టణం. ఈ ప్రాంతం కూడా భూమిలో కూరుకుపోయే ప్రమాదంలో ఉంది.
ఇలా కూరుకుపోవడానికి కారణాలు కనిపెట్టే క్రమంలో మరింత శాస్త్రీయ డేటా అవసరం అని అంటున్నారు ఉత్తరాఖండ్ లోని వాడియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ డైరెక్టర్ కాలాచంద్ సైన్. ఈ ప్రాంతంలో హిమాలయాల జీవావరణం సంక్లిష్టంగా ఉంటుందన్నారు. అభివృద్ధి పనులు, నిర్మాణాలు జరిగే అనేక ప్రదేశాలున్నాయి. ఇంకా ఆ పనులు కొనసాగుతున్నాయి.
వీటి వల్లే ఇలాంటి ప్రకృతి విపత్తులు జరుగుతున్నాయనడానికి శాస్త్రీయ ఆధారాలు లేకపోయినా అలాంటి అభివృద్ధి పనుల వల్ల ఎంతోకొంత ముప్పు ఉంటుందనే విషయాన్ని కొట్టివేయలేం. పర్యావరణవేత్తలు చాన్నాళ్లుగా ఇలాంటి పనులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు జోషిమఠ్ కుంగుబాటుతో ఈ వ్యవహారాలన్నీ బయటపడుతున్నాయి.
చార్ థామ్ యాత్ర మధ్య కనెక్టివిటీ మెరుగుపరచేందుకు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక కొత్త ప్రాజెక్ట్ లు మొదలయ్యాయి. రహదారుల కోసం చెట్లు కొట్టేశారు. కొండచరియలను సరిచేశారు. దీంతో అసలుకే మోసం వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రకృతిని మన అవసరాల కోసం వాడుకుంటే, ఇప్పుడు ప్రకృతే మానవుడిపై పగబట్టినట్టయింది.