సంక్రాంతి సినిమాల పోటీ చివరి దశకు చేరుకుంది. భోగి, సంక్రాంతి అయిపోయాయి, కనుమ వచ్చేసింది. ఇక మిగిలింది ఈ ఒక్క రోజు మాత్రమే. ఇంకా చెప్పాలంటే, సంక్రాంతి సినిమాలకు ఇదే చివరి మేజిక్ డే. మరిన్ని వసూళ్లు కొల్లగొట్టడానికి మిగిలింది ఈ ఒక్క రోజు మాత్రమే. మరి పెద్ద సినిమాల సంగతేంటి?
బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి సినిమా మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ దక్కించుకుంది. వాల్తేరు వీరయ్య రాకతో రెండో రోజు, వారసుడు రాకతో మూడో రోజు ఈ సినిమాకు వసూళ్లు తగ్గుతూ వస్తున్నాయి. ఇక మిగిలింది ఈరోజు మాత్రమే.
ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ప్రకారం.. వీరసింహారెడ్డి సినిమాకు సీడెడ్, గుంటూరులో భారీగా వసూళ్లు వస్తున్నాయి. ఈరోజు కూడా ఇదే ట్రెండ్ కొనసాగితే, బాలయ్య సినిమాకు డీసెంట్ వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా అవ్వదా, లాభాల్లోకి వస్తుందా రాదా అనే విషయం ఈ వీకెండ్ నాటికి తేలుతుంది.
చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య పరిస్థితి కూడా దాదాపు ఇంతే. కాకపోతే వీరసింహారెడ్డి మీద వాల్తేరు వీరయ్యకు మంచి టాక్ ఉంది. సీడెడ్,నైజాం తేడా లేకుండా అన్ని ఏరియాస్ లో ఈ సినిమా బాగా ఆడుతోంది. అయినప్పటికీ వసూళ్ల పరంగా చెప్పుకోదగ్గ నంబర్స్ రాబట్టడానికి చిరు సినిమాకు కూడా ఈరోజే కీలకం.
ఇక మిగతా సినిమాల సంగతి చూస్తే.. తెగింపు ఆల్రెడీ పోయింది. వారసుడు సినిమా రొటీన్ కంటెంట్ తో ఇబ్బంది పడుతోంది. కల్యాణం కమనీయంది కూడా దాదాపు అదే పరిస్థితి. సో.. ఈరోజు ఈ సినిమాలకు ఆక్యుపెన్సీని పెద్దగా ఆశించలేం. చిరు, బాలయ్య సినిమాలకు మాత్రమే ఈరోజు కీలకం.