తెలుగు సినిమాకు స‌మ‌స్య ఎక్క‌డ ఉంది?

ఒక‌వైపు పాన్ ఇండియా ఇమేజ్, తెలుగులో వ‌చ్చే సినిమాలు ఇప్పుడు ఒక‌టికి నాలుగైదు భాష‌ల్లో విడుద‌ల అవుతున్నాయి. మ‌రో వైపు వంద‌ల కోట్ల రూపాయ‌ల మార్కెట్. ఒక్క తెలుగునాటే తెలుగు సినిమాలు ఇప్పుడు సునాయాసంగా…

ఒక‌వైపు పాన్ ఇండియా ఇమేజ్, తెలుగులో వ‌చ్చే సినిమాలు ఇప్పుడు ఒక‌టికి నాలుగైదు భాష‌ల్లో విడుద‌ల అవుతున్నాయి. మ‌రో వైపు వంద‌ల కోట్ల రూపాయ‌ల మార్కెట్. ఒక్క తెలుగునాటే తెలుగు సినిమాలు ఇప్పుడు సునాయాసంగా వంద కోట్ల రూపాయ‌ల వ్యాపారాన్ని చేస్తున్నాయి. స‌రిగా న‌డ‌వాలి కానీ, చిన్న సినిమా పెద్ద సినిమా తేడాల్లేవిప్పుడు. ప్రేక్షుల‌కు క‌నెక్ట్ అయితే వంద కోట్ల రూపాయ‌ల వ‌సూళ్లు, వంద‌ల కోట్ల రూపాయ‌ల వ‌సూళ్లు ఏ మాత్రం క‌ష్టం కాదు! టికెట్ల రేట్లు, ఇతర వ్యాపార వాణిజ్యాలు అలా ఉన్నాయిప్పుడు!

డిజిట‌ల్ రైట్స్, ఓటీటీ రైట్స్, మ్యూజిక్ స్ట్రీమింగ్ రైట్స్, డ‌బ్బింగ్ రైట్స్, రీమేక్ రైట్స్.. ఇలా ర‌క‌ర‌కాల మార్గాల్లో ఆదాయ వ‌న‌రులు ఏర్ప‌డ్డాయి. మ‌రి ఇన్ని ఆదాయ వన‌రులున్నా.. సినిమాల స‌త్తాకు ప‌రీక్ష మాత్రం బాక్సాఫీస్ వ‌సూళ్లే! బాక్సాఫీస్ వ‌ద్ద ఏ సినిమా అయినా స‌త్తా చూపిస్తే మాత్ర‌మే, ఆ సినిమా ఆడిన‌ట్టుగా ప్రేక్ష‌కులు కూడా ప‌రిగ‌ణిస్తారు.

వాస్త‌వానికి ఇన్ని వాణిజ్య మార్గాలు ఏర్ప‌డ్డాకా వైవిధ్య‌త కూడా ఆవిష్కారం కావాల్సింది. ఇన్ని మార్కెటింగ్ వ‌న‌రులు ఉన్నాయి కాబ‌ట్టి.. నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు, హీరోలు, ఇత‌ర సాంకేతిక నిపుణులూ అంతా క‌లిసి వైవిధ్య‌త మీద కృషి చేయ‌డానికి ఆస్కారం కూడా ఉంది. వంద‌ల కోట్ల రూపాయ‌లు ఈజీగానే ల‌భ్యం అవుతున్న‌ప్పుడు.. క‌థ ల మీద బాగా క‌స‌ర‌త్తు చేయ‌డానికి ఆస్కారం కూడా ఉందిప్పుడు! అయితే అన్నీ ఉన్నా.. తెలుగు సినిమా ప‌రిస్థితి మాత్రం వీర సింహారెడ్డి, వాల్తేరు వీర‌య్య‌ల్లాగానే ఉంది! ఇంత‌కు మించి తెలుగు సినిమా ఎదిగేలా లేదు.

ఈ మాట ఎందుక‌నాల్సి వ‌స్తోందంటే.. ఈ సినిమాలు చేసింది సామాన్యులు కాదు కాబ‌ట్టి. ద‌శాబ్దాలుగా తెలుగునాట స్టార్ డ‌మ్ ను ఎంజాయ్ చేస్తూ, కోట్ల రూపాయ‌ల పారితోషికాల‌ను తీసుకుంటూ.. విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను, గ‌ట్టి మార్కెట్ ను క‌లిగి ఉన్న ఇద్ద‌రు హీరోలు.. తెలుగు సినిమా అంటే ఇంతే, ఇలానే ఉంటుంది, వీటినే మీరు చూడాలి త‌ప్ప‌.. మ‌రో సినిమాకు తాము అవ‌కాశం ఇవ్వ‌డం కానీ, మ‌రో సినిమాను ఇదే స‌మ‌యంలో విడుద‌ల‌య్యే అవ‌కాశం కానీ ఇవ్వ‌మ‌ని తేల్చి చెప్పారు! కాబ‌ట్టి.. తెలుగు సినిమా స్టాండ‌ర్డ్స్ గురించి ఇంకా చ‌ర్చించాల్సిన అవ‌స‌రం లేక‌పోవ‌చ్చు!

అయితే ఇలా ఎన్నేళ్లు న‌డుపుతార‌నేదే ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన అంశం. తాము ప్ర‌యోగాలు చేస్తే ప్రేక్ష‌కులు స‌హించ‌లేరు అన్న‌ట్టుగా హీరోల వ్య‌వ‌హ‌రం మారి చాలా కాలం అయ్యింది. ప్ర‌యోగాలంటే అవేవో అమావాస్య చంద్రుడులో క‌మ‌ల్ హాస‌న్ చేసిన పాత్ర‌నో, సేతు సినిమాలో విక్ర‌మ్ చేసిన పాత్ర‌నో తెలుగు స్టార్ హీరోలు కూడా చేయాలంటూ ఎవ్వ‌రూ డిమాండ్ చేయ‌డం లేదు! స‌గ‌టు సినీ ప్రేక్ష‌కుడు కోరుకునేది సినిమాలో వైవిధ్యం మాత్ర‌మే. హీరో ఎలాంటి పాత్ర‌లో క‌నిపించినా, ఏం చేసినా.. క‌థ అంటూ కాస్త భిన్న‌మైన అనుభూతిని ఇవ్వాల‌ని, త‌మ‌కు కొత్త‌ద‌నం కావాల‌ని తెలుగు సినీ ప్రేక్షకులు కోరుకుంటూ ఉన్నారు. అయితే హీరోలు మాత్రం ఆ దిశ‌గా క‌ల‌లో కూడా ఆలోచించేట్టుగా లేరు!

మ‌రి ఇలా చేస్తూ ఆ హీరోలు బావుకుంటున్న‌ది ఏముంది? ప్ర‌తి సినిమాకూ తమ‌కు వ‌చ్చే పారితోషిక‌మా? ఇందుకోస‌మే వారు సినిమాలు చేస్తున్నారా! ఇలా డ‌బ్బులొచ్చే సినిమాలు చేసుకుంటూ, చూసుకుంటూ పోతే అంతిమంగా ప‌లుచ‌న అయ్యేది కూడా వారే! అయిన‌ప్ప‌టికీ తెలుగు సినిమా హీరోలు డ‌బ్బే ప‌ర‌మావ‌ధి, వీరాభిమానుల కోస‌మే త‌మ సినిమాలు త‌ప్ప‌.. ఇంకేమైనా ఫ‌ర్వాలేదు అనుకుంటే.. న‌ష్టం వాళ్ల‌కే! డ‌బ్బు రావొచ్చు గాక‌.. చెప్పుకోవ‌డానికే పెద్ద‌గా ఏమీ మిగ‌ల‌దు!

హీరోల ఆలోచ‌న తీరుల్లో స‌మ‌స్య ఉంద‌నుకుంటే.. నిర్మాత‌ల‌కు అయినా కాస్త తెలివి తేటలుండాలి క‌దా! అయినా నిర్మాత‌ల‌కు కూడా వేర్వేరు వాణిజ్య మార్గాల్లో డ‌బ్బులు వ‌చ్చేస్తాయి. డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు అమ్మేసుకుంటారు. అంతిమంగా హీరోల‌తో పాటు నిర్మాత‌ల‌కూ పోయేదేమీ లేదు. ఎటొచ్చీ ఈ సినిమాల ఓటీటీ హ‌క్కుల‌ను కొంటున్న వాళ్లు, వీటి విడుద‌ల హ‌క్కుల‌ను కొంటున్న డిస్ట్రిబ్యూట‌ర్ల మీద అయితే గ‌ట్టిగానే దెబ్బ‌లు ప‌డుతున్నాయి. కానీ వారి అరుపులు ఎవ్వ‌రికీ వినిపించ‌వంతే!

-హిమ‌