రెండు భారీ సినిమాలు. భారీ విడుదల కార్యక్రమాలు..ప్రమోషన్లు..థియేటర్లు..మామూలు టెన్షన్ కాదు. హడావుడి కాదు. రెండు సినిమాలు బడ్జెట్ గీత దాటేసాయి. రెండు సినిమాలు డెఫిసిట్ అంచుల్లో విడుదలయ్యాయి. రెండు సినిమాల డైరక్టర్లు బడ్జెట్ ను గీత దాటించేసారు. అందులో గోపీచంద్ మలినేని అయితే మరీనూ. అక్టోబర్ కు పూర్తి కావాల్సిన సినిమాను జనవరికి లాక్కు వచ్చారు. ఎన్ని వర్కింగ్ డేస్ అదనమో..ఎన్ని కోట్లు అదనమో..వీటన్నింటికి తోడు నైజాంలో తమ భాగస్వామ్యంతో విడుదల కూడా తలకెత్తుకుంది మైత్రీ సంస్థ.
విడుదలయిన తరువాత ఒకటే గందరగోళం. బలపు..ఎంతో..వాపు ఎంతో తెలియని వైనం. టికెట్ లు కొని సినిమాలు వెళ్లినవారు ఎందరో, టికెట్ లు విరాళంగా పంచినా వారు ఎందరో. లెక్క తెలియని పరిస్థితి. విడుదలయిన మూడు, నాలుగు రోజులు తరువాత క్లారిటీ వచ్చేసింది. సంక్రాంతి విన్నర్ వాల్తేర్ వీరయ్య…రన్నర్ వీరిసింహారెడ్డి… ఫెయిల్యూర్ వారసుడు.
మైత్రీ మూవీస్ రెండు సినిమాలు భారీ రేట్లకు మార్కెట్ చేసింది. అయితే అందరూ రెగ్యులర్ బయ్యర్స్. మైత్రీ ఎంత కట్టమంటే అంతా కట్టారు. ఆంధ్ర రెండు సినిమాలు కలిసి 70 నుంచి 75 కోట్ల మేరకు కట్టారు. నైజాం 33 కోట్లు మేరకు కట్టారు. ఇలాంటి దశలో సినిమాలు తేడా వస్తే జిఎస్టీ వెనక్కు ఇవ్వాలన్నా పాతిక కోట్లు చేతికి తగుల్తాయి.
కానీ తొలి నాలుగు రోజులు, మూడు రోజుల ట్రెండ్ చూస్తుంటే అలాంటి అవసరం లేదని అనిపిస్తోంది. 18 కోట్లకు వైజాగ్ ఏరియా ఇస్తే రెండూ కలిపి ఇప్పటికే 10 కోట్ల వరకు చేసాయి. నైజాం 33 కోట్ల మేరకు ఇస్తే ఇప్పటికే పాతిక కోట్ల మేరకు వసూళ్లు వచ్చాయి. మిగిలిన ఏరియాల్లో కూడా ఇదే పరిస్థితి వుంది.అందువల్ల జిఎస్టీలు వెనక్కు ఇవ్వాల్సిన పరిస్థితి కనిపించడం లేదు. పనిలో పనిగా ఇంతో అంతో కమిషన్ వచ్చే అవకాశాలు వున్నాయి.
వీరయ్య ప్లస్ అయింది
రెండు సినిమాలు కలిపి ఒకే బయ్యర్ కు ఇవ్వడం అన్నది ప్లస్ అయింది. వీరిసింహా కు లాంగ్ రన్ వుండదన్న క్లారిటీ వచ్చింది. కానీ వీరయ్య కు వుంటుంది. అంటే మొత్తం మీద చూసుకుంటే సేఫ్ అవుతారు. అంటే వీరయ్య వుండడం వీరసింహా నష్టాలను కవర్ చేస్తుందన్న మాట బయ్యర్లకు.
రెండు సినిమాలు పోటా పోటీగా రావడం, కులాల వారీగా పోటీలు, వీటన్నింటి వల్ల విపరీతమైన బజ్ రావడం వల్ల రెండు సినిమాలు ఈ మేరకు వసూళ్లు సాగించాయి. విడివిడిగా వచ్చి వుంటే ఫలితం తేడాగా వుండేది అన్నది ట్రేడ్ వర్గాల మాట.
నైజాం ఓపెన్ అయ్యింది
నైజాం కింగ్ అనుకున్న దిల్ రాజు ఇగో కు లేదా పంతానికి పోయి మైత్రీని వదులుకున్నారు. దీంతో అసలు తప్పు వేరే జరిగింది అన్నది ట్రేడ్ వర్గాల బొగట్టా. ఇప్పటి వరకు నైజాం బిజినెస్ గుట్టుగా సాగుతోంది. సునీల్, దిల్ రాజు ఇద్దరికీ సరైన లెక్కలు తెలుసు. ఇప్పుడు మైత్రీకి తెలిసి వచ్చింది. ఈ లెక్కలు చూసిన తరువాత మిగిలిన నిర్మాతలు కూడా తమ సినిమాల మీద ఓ అంచనాకు వస్తారు.
రెండు సినిమాలు కలిసి నైజాంలో 40 కోట్లు, ఇంకా పైన చేస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పుడు దిల్ రాజు సినిమాలకు కోట్ చేసే అంకెలు మార్చుకొవాల్సి వుంటుంది.