కరోనా బారిన పడిన ఎస్పీ బాలసుబ్రమణ్యం ప్రస్తుతం చెన్నైలోని ఓ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆయన త్వరగా కోలుకోవాలని పలువురు టాలీవుడ్ ప్రముఖులు తమ సందేశాలు అందిస్తున్నారు. ఈ క్రమంలో చిరంజీవి కూడా బాలు త్వరగా కోలుకోవాలంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. అందులో బాలుతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
“బాలుతో నాది సినిమా బంధమే కాదు, కుటుంబపరంగా కూడా ఎంతో సాన్నిహిత్యం ఉంది. చెన్నైలో మేం పక్కపక్క వీధుల్లో ఉంటూ తరుచూ కలుసుకునే వాళ్లం. ఎన్నో సంవత్సరాల వ్యక్తిగత అనుబంధం మాది. బాలును నేను అన్నయ్యా అంటూ ఆప్యాయంగా పిలుస్తుంటాను. బాలు చెల్లెళ్లు వసంత, శైలజలు కూడా నన్ను అన్నయ్యలా చూసుకుంటారు.”
ఇలా ఎస్పీ బాలుతో పాటు ఆయన కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు చిరు. గడిచిన 3 రోజులుగా వసంత, శైలజ, శుభలేఖ సుధాకర్ తో టచ్ లో ఉన్నారు చిరంజీవి. బాలు ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.
బాలు త్వరగా కోలుకొని కోటి రాగాలు తీయాలని ఆకాంక్షించారు చిరు. త్వరలోనే బాలు బయటకొస్తారని, రెట్టించిన ఉత్సాహంతో ఎప్పట్లానే భారతీయులందర్ని తన గాత్రంతో అలరిస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు.