నిన్నంతా ప్రభాస్ ఆదిపురుష్ విశేషాలు ట్రెండ్ అయ్యాయి. ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో కనిపించబోతున్నాడనే విషయం దాదాపు స్పష్టమైంది. అటు దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా ఈ విషయాన్ని ఓపెన్ చేయడంతో మేటర్ క్లియర్ అయింది. మరోవైపు కృష్ణంరాజు కూడా ఈ సినిమాపై స్పందించారు. మహావిష్ణువు దశావతారాల్లో ఓ అవతారాన్ని ఆదిపురుష్ లో చూపిస్తారని చెప్పేశారు.
అయితే ఆదిపురుష్ లో శ్రీరాముడిలా ప్రభాస్ ఎలా కనిపించబోతున్నాడనే చర్చ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. సరిగ్గా ఇక్కడే మేకర్స్ తెలివిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను వాళ్లు ఓ మైథలాజికల్ సోషియో ఫాంటసీ సినిమాగా చెబుతున్నారు తప్ప, భక్తిరస చిత్రంగా చెప్పడం లేదు.
శ్రీరాముడి పాత్రతోనే ఆదిపురుష్ సినిమా వస్తుందని చెబితే మేకింగ్ కు సంబంధించి చాలా పరిమితులు ఉంటాయి. మరీ ముఖ్యంగా వివాదాలు కూడా తలెత్తే అవకాశం ఉంది. అందుకే మేకర్స్ ఎక్కడా ఇది శ్రీరాముడి పాత్ర అని కానీ, రామాయణ ఇతివృత్తం అని కానీ చెప్పడం లేదు. కేవలం మైథలాజికల్ సోషియో ఫాంటసీ అని మాత్రమే చెబుతున్నారు.
ఇలా చెప్పడం వల్ల ప్రభాస్ ను శ్రీరాముడి పాత్రలో ఇన్నాళ్లూ పురాణాలు, పాత సినిమాల్లో చూపించిన మాదిరిగా కాకుండా.. మరింత కొత్తగా చూపించడానికి వీలవుతుంది. దానికి హింట్ ఇస్తూ..నిన్న రిలీజ్ చేసిన పోస్టర్ డిజైన్ లోనే ప్రభాస్ లుక్ ఇలా ఉంటుంది అనేలా A అనే అక్షరంలో ఓ గెటప్ ను ఇంపోజ్ చేసి చూపించారు.ఆ లుక్ లో మీసాలు, గెడ్డం, పొడుగు జుట్టు ఉంది.
సో.. రాబోయే రోజుల్లో కూడా ఆదిపురుష్ పాత్రను రాముడి పాత్రగా మేకర్స్ చెప్పకపోవచ్చు. కేవలం రామాయణాన్ని ఇతివృత్తంగా మాత్రమే తీసుకున్నామని చెప్పే అవకాశం ఉంది. ఈ లాజిక్స్ అన్నీ పక్కనపెడితే.. సినిమాలో ప్రభాస్ మాత్రం నెవర్ బిఫోర్ లుక్ లో కనిపించడం మాత్రం గ్యారెంటీ.