గాడ్ ఫాదర్, మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తి ఆయన తమ్ముడు పవన్‌కల్యాణ్‌లో కొంచెమైనా కనిపించదు. తమ్ముడైన జనసేనాని పవన్‌కల్యాణ్‌ను పాలకుడిగా చూడాలనే బలమైన కోరికను చిరంజీవి ఇవాళ బయటపెట్టారు.
ఇంత కాలం తమ్ముడి రాజకీయాలపై ఎలాంటి కామెంట్ చేయకుండా మౌనాన్ని పాటిస్తూ వచ్చిన చిరంజీవి… మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్న నుంచి తప్పించుకోలేకపోయారు. తమ్ముడిపై ప్రశంసలు కురిపిస్తూ, అతన్ని రాజకీయంగా ఉన్నత స్థానంలో ఉండాలన్న అభిలాషను బయట పెట్టుకున్నారు. చిరంజీవి ఏమన్నారంటే…
“పవన్‌కల్యాణ్ లాంటి నిబద్ధత ఉన్న నాయకుడు మనకు రావాలి. నా ఆకాంక్ష కూడా అదే. దానికి నా మద్దతు వుంటుంది. పవన్‌కు రాష్ట్రాన్ని ఏలే అవకాశం ప్రజలు ఇచ్చే రోజు రావాలని నేను కోరుకుంటున్నా” అని చిరంజీవి అన్నారు.
ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే… ఒక్క పవన్‌కల్యాణ్‌కు తప్ప, ఆయన్ను అభిమానించే ప్రతి ఒక్కరూ జనసేనానిని సీఎంగా చూడాలని అనుకుంటున్నారు. ఇదేం విచిత్రమో, పవన్ మాత్రం చంద్రబాబును సీఎంగా చూడాలని పరితపిస్తున్నారు. చిరంజీవి, మెగా అభిమానుల ఆకాంక్షలు ఏమైనా, అసలైన నాయకుడిలో సీఎం కావాలనే ఫైర్ లేకపోతే ఏం చేయగలరనే ప్రశ్న ఉత్పన్నమైంది.
తాను, పవన్‌కల్యాణ్ చెరో పార్టీలో వుండడం వల్ల తమ్ముడికి నష్టం వస్తుందనే ఉద్దేశంతోనే, రాజకీయంగా మౌనంగా వుంటున్నట్టు ఇవాళ చిరంజీవి అసలు విషయాన్ని చెప్పారు.
అన్న అంతరంగాన్ని ఎరిగిన తమ్ముడిగా పవన్‌కల్యాణ్ ఎంతో బాధ్యతగా మెలగాల్సి వుంది. అయితే అన్న ఆశయానికి విరుద్ధంగా చంద్రబాబును సీఎం చేయాలని పవన్ పని చేయడమే మెగా అభిమానులకు నచ్చలేదు. చిరంజీవి బహిరంగంగానే చెప్పిన తర్వాతైనా, పవన్ కల్యాణ్ తన పంథాను మార్చుకుని వ్యవహరిస్తారో లేదో చూడాలి.