ఓ హీరో రెమ్యూనిరేషన్ కు కొలమానం ఏమిటి? అతని మార్కెట్..అంతే కదా? హీరోలు కూడా ఏమంటారు..నిర్మాతలు ఏమని సమర్థిస్తారు..డిమాండ్ అండ్ సప్లయ్ సూత్రం ప్రకారమే రెమ్యూనిరేషన్లు తీసుకుంటున్నాం..ఇస్తున్నాం అంటారు. సరే, ఈ లెక్కలే చూద్దాం. మరి ఇప్పటికీ చిరంజీవి మెగాస్టారేనా? అన్నది జనాల ఆలోచనకే వదిలేద్దాం.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరు తన గాడ్ ఫాదర్ కు తీసుకున్న రెమ్యూనిరేషన్ 50 కోట్లు.
వాల్తేర్ వీరయ్యకు తీసుకున్న పారితోషికం 55 కోట్లు
భోళాశంకర్ కు చార్జ్ చేసింది 65 కోట్లు.
గాడ్ ఫాదర్ సినిమా అక్కడికి అక్కడ సరిపోయింది. వాల్తేర్ వీరయ్య సినిమాకు కాస్త లాభాలు వచ్చాయి. మరి భోళా శంకర్ పరిస్థితి ఏమిటి?
టాలీవుడ్ మెగాస్టార్ సినిమాను నైజాం ఏరియాకు కొనే బయ్యర్ లేడు. ఒకప్పుడు మెగాస్టార్ తన రెమ్యూనిరేషన్ కింద నైజాం ఏరియా తీసుకునేవారు అనే టాక్ వుండేది. అలాంటి నైజాం ఏరియాలో చిరు సినిమాను కొనేవారు లేకపోయారు. ఆఖరికి 20 కోట్ల అడ్వాన్స్ మీద పంపిణీ చేసారు.
పోనీ నైజాం సంగతి పక్కన పెడితే ఓవర్ సీస్ లో భోళాశంకర్ ను కొనేవారు లేకపోయారు. ముందు కొంటా అన్న బయ్యర్ వెనుకంజ వేస్తే, ఆ బయ్యర్ కే మళ్లీ డిస్ట్రిబ్యూషన్ కు ఇచ్చారు. అదీ పరిస్థితి.
ఆంధ్రలో రెండు మూడు ఏరియాలు మాత్రం అమ్మగలిగారు. మిగిలిన ఏరియాలు అమ్మలేకపోయారు.
అంతకన్నా దారుణం ఏమిటంటే భోళా శంకర్ సినిమా శాటిలైట్ హక్కులు అమ్ముడు కాలేదు. మెగాస్టార్ చిరంజీవి సినిమా శాటిలైట్ హక్కులు అమ్ముడు కాలేదు అంటే ఇంకేం అనుకోవాలి? గమ్మత్తేమిటంటే లాస్ట్ మినిట్ లో చిరుకు ఇవ్వాల్సిన రెమ్యూనిరేషన్ బకాయి కింద శాటిలైట్ హక్కులు ఇచ్చి కొంత కవర్ చేద్దామనుకున్నారు నిర్మాత అనిల్ సుంకర. కానీ దానికి చిరు ససేమిరా అన్నట్లు తెలుస్తోంది. తనకు హక్కులు అవసరం లేదని పట్టుపట్టడంతో, ఆఖరికి 60 కోట్ల వరకు చెల్లింపు చేసి, అయిదు కోట్లకు పోస్ట్ డేటెడ్ చెక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
మరి చిరు మెగాస్టార్ అయితే ఈ సినిమా పరిస్థితి ఇలా ఎందుకు వుంది. భోళాశంకర్ సినిమా మొత్తం మీద నిర్మాత అనిల్ సుంకర కు 40 కోట్ల వరకు డెఫిసిట్ వచ్చినట్లు తెలుస్తోంది. ఆయన నానా ఇబ్బందులు పడి సినిమాను విడుదల చేసారు.
ఇక్కడ తప్పు ఎవరిది? 65 కోట్లు రెమ్యూనిరేషన్ అడిగిన మెగాస్టార్ ది కాదు. ఎగబడి ముందుకు వెళ్లి సినిమా తీసిన నిర్మాతది. రేపు భవిష్యత్ లో సినిమా తీయబోతున్న నిర్మాతలది.
–మనోజ్