ఆ డైరెక్టర్ సినిమాలు తెలుగు వారికి మామూలుగానే పెద్దగా నచ్చవు! తెలుగులో దాదాపు దశాబ్దంన్నర కిందట అతడు శంఖం అని ఒక సినిమా తీశాడు. అంతకు ముందే శౌర్యం అనే సినిమాను తీశాడు. శౌర్యం ఫర్వాలేదు. శంఖం మాత్రం డిజాస్టర్. థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకుడికి తలబొప్పి కట్టించి పంపించింది ఆ సినిమా.
ఆ తర్వాత దరువు అంటూ థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకుడిని చితకొట్టాడు ఈ దర్శకుడు. రవితేజ నటించిన ఆ సినిమా పుట్టించే విసుగు అలాంటిలాంటిది కాదు. పొరపాటున ఆ సినిమా సీన్ ఏదైనా టీవీలో చూసినా.. ఇరిటేషన్ తప్పదు. అలా ఉంటుంది ఆ సినిమా.
ఒక వీరమ్ రీమేక్ కాటమరాయుడి ఫలితం తెలిసిందే. ఈ మధ్యనే అన్నత్తే అంటూ ఆ దర్శకుడు తమిళ, తెలుగు ప్రేక్షకులను జాయింటుగా విసిగించాడు. ఇక తమిళంలో వివేగం, విశ్వాసం అంటూ అజిత్ తో ఇతడు మరో రెండు సినిమాలను తీశాడు. అవి అక్కడ ఆడాయి కానీ, తెలుగు ప్రేక్షకులకు నచ్చే ఎలిమెంట్స్ వాటిల్లో మిస్ అయ్యాయి.
ఇప్పుడు వేదాళం రీమేక్ తన్నేసింది. మరి చిరంజీవి సినిమాలు ఫెయిల్ అయితే.. వాటికి కారణం దర్శకులు అనడం ఈజీనే కదా! ఆచార్య ఫలితం తర్వాత కొరటాలతో ఇలానే ఆడుకున్నారు. మరి ఆ లెక్కన ఇప్పుడు భోళా శంకర్ విషయంలోనే ఒకరిని కార్నర్ లో నిలబెట్టాలి.
దర్శకరత్నం మెహర్ ను అలా నిలబెడతారా! అబ్బే.. ఆ దర్శకుడు అందుకు ఒప్పుకోడు. శక్తి సినిమా విషయంలో కూడా తన తప్పేం లేదని.. ఈ మధ్యనే లాజిక్ గా చెప్పాడు ఆ దర్శకుడు. కాబట్టి.. ఎవరిని కార్నర్ చేయొచ్చు.. వేదాళం దర్శకుడు శివదే తప్పని ఒక జబర్ధస్త్ స్కిట్ చేయిస్తే పోదా!