పవన్ గాజువాక టూర్ లో ఆ ప్రకటన…?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర విశాఖ జిల్లాలో సాగుతోంది. పవన్ ఈ నెల 19 దాకా విశాఖలో యాత్ర నిర్వహిస్తారు. యాత్ర పూర్తి షెడ్యూల్ ని పార్టీ విడుదల చేసింది. దాని…

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర విశాఖ జిల్లాలో సాగుతోంది. పవన్ ఈ నెల 19 దాకా విశాఖలో యాత్ర నిర్వహిస్తారు. యాత్ర పూర్తి షెడ్యూల్ ని పార్టీ విడుదల చేసింది. దాని ప్రకారం చూస్తే ఈ నెల 13న ఆదివారం గాజువాకలో పవన్ టూర్ ఉంది. బహిరంగ సభ అక్కడ ఉంటుంది.

గాజువాకలో పవన్ అంటే 2019 నాటి ఎన్నికల సంగతులు గుర్తుకు వస్తాయి. పవన్ ఆనాడు గాజువాకలో పోటీ చేశారు, ఓడిపోయారు. ఈసారి అక్కడ నుంచి ఆయన్ని పోటీ చేయమని జనసేన నేతలు కోరుతున్నారు. పవన్ అయితే గత నాలుగేళ్లలో గాజువాకకు వెళ్ళింది ఒకటి రెండు సార్లు మాత్రమే.

గత ఏడాది స్టీల్ ప్లాంట్ కార్మికుల ఉద్యమ సభలో మాట్లాడినపుడు పవన్ గాజువాకలో తన ఓటమిని గుర్తు చేసుకున్నారు. గోదావరి జిల్లాలోనే పవన్ ఈసారి పోటీ చేస్తారు అని ప్రచారం సాగుతున్న వేళ గాజువాకలో పవన్ ఏమి చెబుతారు అన్నది ఆసక్తిని పెంచే విషయమే.

గాజువాక నుంచి తాను పోటీ చేస్తాను అని పవన్ ప్రకటిస్తే అది రాజకీయ సంచలనమే అవుతుంది. గోదావరిలో భీమవరంతో పాటు గాజువాక నుంచి మళ్ళీ పోటీ చేయడం ద్వారా నాటి ఓటమికి ఈసారి గెలుపుతో బ్యాలెన్స్ చెసుకోవాలని పార్టీ నేతలు పవన్ని కోరుతున్నారు. 

టీడీపీలో కీలక నేతలు ఉన్న ఈ సీటులో తాను పోటీ చేసినా చేయకపోయినా జనసేనకే పొత్తులో కేటాయించుకునే విషయంలో మాత్రం పవన్ గట్టిగానే నిలబడతారు అని అంటున్నారు. గాజువాక టూర్ లో స్టీల్ ప్లాంట్ సమస్య మీద మాట్లాడాల్సి వస్తే పవన్ బీజేపీని నిలదీస్తారా అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి.