పవన్ కల్యాణ్ కెరీర్‌లో 80 శాతం రీమేక్ లే. తొలి సినిమానే ఖయామత్ సే ఖయామత్ తక్ రీమేక్ తో మొదలుపెట్టిన పవన్ కల్యాణ్.. ఆ తర్వాత పదికి ఎనిమిది సినిమాలు రీమేక్ లుగానే చేశాడు. ఇక చిరంజీవి సినిమా కెరీర్ కు రీ ఎంట్రీ ఇవ్వడమే రీమేక్ సినిమా ద్వారా చేశారు. సేఫ్ రీ లాంఛింగ్ కోసం అలా రీమేక్ చేశారనుకున్నారంతా.
అయితే లూసీఫర్ రీమేక్.. చిరంజీవి చేసిన విఫల ప్రయత్నం. మలయాళం వెర్షన్ అప్పటికే తెలుగులోకి డబ్ అయిపోయి సంవత్సరాలు గడిచిన తర్వాత, మలయాళీ వెర్షన్ ను డబ్బింగ్ ను తెలుగు ప్రేక్షకులు ఆస్వాధించిన తర్వాత.. దాన్ని రీమేక్ చేసి చిరంజీవి నిరాశ పరిచారు. ఒరిజినల్ లో ఉన్న ఫీల్ ను పూర్తిగా మిస్ చేశారు. అయితే అప్పటికే తలకెత్తుకున్న వేదాళం రీమేక్ ఇప్పుడు మేకులా దిగింది.
ఇక పవన్ కల్యాణ్ కూడా వరస రీమేక్ ల పరంపరలో ఉన్నారు. వీరమ్ రీమేక్ తర్వాత కూడా పవన్ ధోరణి మారలేదు. అయితే కాపీలు, లేకపోతే రీమేక్ లు అన్నట్టుగా పవన్ కల్యాణ్ సినిమాల పరంపర సాగుతూ ఉంది. రెండు వారాల వ్యవధిలో రెండు రీమేక్ లతో మెగా బ్రదర్స్ పలకరించారు. బ్రో కు కనీసం కాస్త సానుకూల టాక్ వచ్చింది. అయితే చిరంజీవి రీమేకు తొలి రోజు సాయంత్రానికే ఏకగ్రీవంగా డిజాస్టర్ గా డిక్లేర్డ్ అయ్యింది.
అయితే ఇప్పుడు చర్చ.. ఈ రీమేకులు ఇంకా ఎన్ని దిగ్గొట్టడం జరుగుతుందనేది. సెట్స్ పై ఉన్న పవన్ సినిమాల్లో ఆల్రెడీ ఒకటి రీమేకే. అయితే వీలైనంతగా సినిమాలు పూర్తి చేసేసి సొమ్ములు చేసుకునే పనిలో ఉన్న పవన్ కల్యాణ్.. రేపోమాపో ఇంకో రీమేక్ ఎత్తుకున్నా పెద్ద ఆశ్చర్యం లేదు.
ఇక రీ ఎంట్రీలో ఎలాంటి సినిమాలు చేయాలనే కన్ఫ్యూజన్ లో చిరంజీవి ఉన్నారు. రీమేక్ లు అయితే సేఫ్ అన్నట్టుగా ఇలాంటి మేకులు దించుతున్నారు. స్ట్రైట్ సినిమాలు చేస్తే అవి ఆచార్యలు అవుతున్నాయి. రీమేక్ అయితే బోల్తా కడుతున్నాయి! కింకర్తవ్యమ్?